చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ రెండు పార్టీలు గ‌త ప‌ర్యాయం అధికారాన్ని పంచుకున్నాయి. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నాయి. రెండు చోట్లా పార్టీ అధినేత‌లతో విభేదించి ఆ కుటంబంలోని మ‌హిళలు వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న‌ సోద‌రి వైఎస్ ష‌ర్మిళ బ‌ద్ధ శ‌త్రువుల్లా మారిపోవ‌డం తెలిసిందే.

అలాగే కేసీఆర్, కేటీఆర్‌ల‌ను వ్య‌తిరేకిస్తూ క‌విత కూడా వేరు కుంప‌టి పెట్టుకున్నారు. కొత్త పార్టీ పెట్టాక అన్న‌, తండ్రి మీద ఆమె ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కూతురు పార్టీ పెట్ట‌డం మీద కేసీఆర్ విముఖ‌త గురించి తెలిసిందే కానీ, ఆయ‌న ఓపెన్‌గా ఎప్పుడూ ఏ స్టేట్మెంట్ ఇవ్వ‌లేదు. కేటీఆర్ ఆచితూచి మాట్లాడుతున్నారు. ఐతే తాజాగా ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేటీఆర్.. వార‌సత్వ రాజ‌కీయాల్లో పురుషుల‌కే పెద్ద పీట వేయ‌డం గురించి త‌న చెల్లెలిని ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తూ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు.

ఈ క్ర‌మంలో క‌విత మీద కొంచెం గ‌ట్టిగానే విమ‌ర్శ‌లు చేశారాయ‌న‌.
”నేను వ‌రుస‌గా ఐదుసార్లు ఎన్నిక‌ల్లో గెలిచాను. జ‌నాలు న‌న్ను మెచ్చి ఓటు వేస్తుంటే ఎందుకు ఇబ్బంది? మా చెల్లెలు నా మీద ఆధిప‌త్యం చ‌లాయించాల‌ని ఎందుకు కోరుకుంటున్నారు. ఆమె వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. పార్టీ నుంచి ఆమె బ‌య‌టికి వెళ్లాల‌నుకున్నారు. వెళ్లారు. ఆమెకు కావాల్సిన‌న్ని అవ‌కాశాలు ఇచ్చాం. ఆమె ఎంపీగా ప‌ని చేశారు. తర్వాత ఓట‌మి పాల‌య్యారు. మ‌ధ్య‌లో ఎమ్మెల్సీని చేశాం. అయినా పార్టీని వ‌దిలేయాల‌నుకుంటే ఏం చేస్తాం?

కేసీఆర్ రాష్ట్రం కోసం త‌న జీవితాన్ని ధార‌బోశారు. అలాంటి వ్య‌క్తికి మ‌కిలి అంటించాల‌నుకుంటే, ఆయ‌న‌పై దాడి చేయాల‌నుకుంటే.. మీకు, ప్ర‌త్య‌ర్థుల‌కు తేడా ఏముంది? అన్ని అవ‌కాశాలు అందుకున్నాక కూడా కృత‌జ్ఞ‌త లేకుంటే, పార్టీ అధినేత‌నే విమ‌ర్శిస్తానంటే.. అలా ఉండ‌నివ్వండి. మీ త‌ల్లిదండ్రుల‌ను సంతోష‌పెట్ట‌క‌పోయినా ప‌ర్వాలేదు. వారిని బాధ పెట్ట‌కూడ‌దు. రాజ‌కీయాలు, మిగ‌తా ప్ర‌తికూల విష‌యాల కంటే కుటుంబం ముఖ్యం అన్న‌ది గుర్తుంచుకోవాలి. మీ పిల్ల‌ల‌కు మీరొక చెడ్డ ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నార‌న్న సంగ‌తి మ‌ర‌వొద్దు” అని కేటీఆర్ అన్నారు.