నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పోలీసుల మాదిరిగా ఉగ్రవాదులు కూడా యూనిఫాం ధరించి.. విద్యార్థులను చెదరగొడుతున్నట్టుగా నటించి.. పేలుళ్లకు తెగబడేలా ప్లాన్ చేశారని.. సంచలన విషయాలు వెల్లడించారు. దీని వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉందని పేర్కొన్నారు. దీనిపై పక్కా ఆధారాలను కూడా సేకరించామని వివరించారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు ఆయా విషయాలు వెలుగు చూసినట్టు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీనేత సువేందు అధికారిని కూడా చంపేసే ప్లాన్ చేసుకున్నట్టు వివరించారు. పక్కా ప్లాన్‌తోనే జైషే ఉగ్రవాదులు హమీమ్ అనే వ్యక్తికి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. దీనికిగాను కొందరు యువతను వినియోగించుకున్నట్టు తెలిపారు. వీరు వాస్తవ పోలీసుల మాదిరిగా యూనిఫాంలో వచ్చి.. విద్యార్థుల్లో అలజడి సృష్టించి.. అనంతరం విధ్వంసం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు.
మరి వచ్చారా?
అయితే.. ఉగ్రవాదులు.. పోలీసు యూనిఫాంలో ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనలో చొరబడ్డారా? లేదా? అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కొందరు పోలీసులు.. నిరసనల సమయంలో స్కార్ఫ్‌లు ధరించి ఉన్నారని, ముఖానికి మాస్కులు పెట్టుకుని ఉన్నారని.. వీరు ఎవరనేది విచారణ చేస్తున్నామన్నారు. అదేసమయంలో కొందరు పోలీసులు.. విద్యార్థులతో కలిసి రాళ్లు రువ్వుతున్న ఘటనలను కూడా గుర్తించామన్నారు. ఇది అసాధారణమని పేర్కొన్నారు.
ఆది నుంచి అనుమానం..
మరోవైపు.. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా ప్రకటన జారీ చేసింది. ఢిల్లీలో పరిస్థితులు సునిశితంగా ఉన్నాయని తాము ఆది నుంచి చెబుతున్నామని తెలిపింది. విద్యార్థుల రూపంలో ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశం ఉందని తాము అనుమానించామని.. ఇంటిలిజెన్స్ కూడా ఇదే చెప్పిందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులతో తక్షణమే చర్చలు జరిపేలా చర్యలు తీసుకున్నట్టు వివరించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. ఉగ్రవాద సమూహాలకు సహకరించేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
