కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు ఫీజుల చెల్లింపుల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించే దిశగా ఆలోచన చేస్తుంది. దీంతో ఫీజు రీ యంబర్స్మెంట్ పథకం అమలుపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్థాప్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. ఒకేసారి మొత్తం చెల్లించడం ప్రభుత్వానికి భారంగా మారిన నేపథ్యంలో ఏడాదికి మూడు విడతల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

విద్యా సంవత్సరం ప్రారంభంలో తొలి విడత, మూడు నెలల తర్వాత రెండో విడత, చివరిగా సెమిస్టర్ పరీక్షల సమయంలో మూడో విడతగా విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీంతో ప్రభుత్వానికి ఆర్ధికంగా కొంత వెసులుబాటు దొరుకుతుందని, విద్యార్థులకు కూడా అవసరమైన ఆర్థిక సహాయం లభిస్తుందని చెబుతున్నారు .

ఇప్పటికే ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు 8 వేల కోట్ల రూపాయలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థి సంఘాలు ఒత్తిడి తీసుకొని వస్తున్నాయి. జంతర్ మంతర్ ఉద్యమం నేపథ్యంలో విద్యార్థులు కనుక ఆందోళనకు దిగితే చెజేతులా తలనొప్పులు తెచ్చుకున్నట్లవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. కనుక ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.