టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు ఈ మధ్య అవకాశాలు కొంచెం తగ్గాయి. అయినా సరే సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది సురేఖ. చాలా మంది తెర మీద బోల్డ్ రోల్స్ చేస్తూ బయట కొంచెం హోమ్లీగా కనిపిస్తారు. కానీ సురేఖ అందుకు పూర్తి భిన్నం. తెరపై ఎక్కువగా హోమ్లీ రోల్స్ చేసే ఆమె.. బయట బోల్డుగా కనిపిస్తుంటుంది.
మిడిల్ ఏజ్ లోనూ ఉన్న ఆమె తన కూతురు సుప్రీతతో పోటీగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు.. కామెంట్లు కూడా బోల్డుగానే ఉంటాయి. అందుకు తగ్గట్లే నెటిజన్లు కూడా సురేఖ మీద రకరకాల కామెంట్లు చేస్తుంటారు. ఆరోపణలు కూడా గుప్పిస్తుంటారు. ఆ కామెంట్లు అన్ని చదివితే సున్నిత మనస్కులు తట్టుకోవడం కష్టం. కానీ సురేఖ మాత్రం టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా కౌంటర్లు వేస్తుంటారు.
ఈ నేపథ్యంలో తాను నటించిన నిరమ్ అనే కొత్త సినిమా ప్రమోషన్ కోసం మీడియాను కలిసిన సురేఖకు సోషల్ మీడియా కామెంట్ల గురించి ప్రశ్న ఎదురైంది. వాటిని ఎలా తీసుకుంటారు అని అడిగితే చాలా లైట్ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేసింది సురేఖ.
“నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను.. ఒకప్పుడు ఇలాంటివి పట్టించుకుని బాధ పడేవాళ్ళం. తర్వాత పట్టించుకోవడం మానేశాం. మనదేంటి.. నేనేంటి.. నాకేంటి.. అంతే. చుట్టు పక్కల వాళ్ళ గురించి నాకు అనవసరం. నేను ఈ పోస్ట్ పెట్టాలి అనుకుంటే నేను పెడతా. ఇలా ఫోటో దిగాలి అంటే దిగుతా. అది నా ఇష్టం. నేను ఏం చెయ్యాలి అనుకుంటే అది చేస్తా. అంతే తప్ప ఎవరు ఏమనుకుంటారు అని ఆలోచిస్తే కష్టం” అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేసింది సురేఖావాణి.
మరోవైపు గతంలో మా అమ్మకు రెండో పెళ్లి చేస్తా అన్న తన కూతురి వ్యాఖ్యల గురించి కూడా సురేఖ స్పందించింది. “నాకు ఆ ఆలోచనైతే లేదు. ఒకవేళ ఉండుంటే ఇన్ని రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఆలోచనే లేదు. ఇకమీదట కూడా ఉండదనే అనుకుంటున్నా. మా అమ్మాయికి పెళ్లే చేసే వయసొచ్చింది. నేనేం పెళ్లి చేసుకుంటాను. అయినా నా పెళ్లి మీడియా వాళ్లు ఎప్పుడో చేసేశారు. రాసేశారు కూడా” అని ఆమె సరదాగా కామెంట్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

