కేంద్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో ఇరుకున పెట్టి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు విశ్రమించని .. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. అభిజిత్ దీప్కేకు ఉచ్చు బిగిస్తోంది. కొందరు అనుమానించినట్టుగానే.. ఆయనపై ఇప్పుడు విమర్శలు, విచారణలకు డిమాండ్ చేస్తూ.. మహారాష్ట్రకు చెందిన బీజేపీ సానుభూతి పరుడు ఒకరు సమాచార హక్కు చట్టం కింద పలు ప్రశ్నలు సంధిస్తూ.. విచారణ కోరుతున్నారు. దీనిని అధికార వర్గాలు కూడా సీరియస్‌గా తీసుకున్నాయి.
ఇవీ.. దీప్కేకు ప్రశ్నలు..
1) అంత సొమ్ము ఎక్కడిది?: అభిజిత్ దీప్కే అమెరికాలో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివారు. అయితే.. ఆయనకు అమెరికాకు వెళ్లేంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? దానిని ఎవరు ఇచ్చారు.. అన్నది సదరు బీజేపీ సానుభూతి పరుడు.. అమిత్ తివారీ ప్రశ్నించారు. దీనిపై విచారణ చేయాలని.. అప్పుడు నిజానిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. దీనిని విచారణకు తీసుకున్నారు.
2) కుటుంబ ఆదాయం లెక్కలు ఏవీ?: అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్ దీప్కే.. కేవలం చిన్న ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని.. ఆయన రిటైరై కూడా చాలా కాలమే అయిందని అమిత్ తివారీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ, ఇటీవల ఈ కుటుంబం విల్లాను కొనుగోలు చేసిందని.. పొలాలు కూడా కొనుగోలు చేసిందని ఈ సొమ్మును కుటుంబ ఆదాయం లెక్కల్లో చూపించారో లేదో పరిశీలించాలని ఐటీ విభాగానికి లేఖ సమర్పించారు. దీనిని కూడా అధికారులు విచారణకు తీసుకున్నారు.
3) విరాళాలు సేకరించవచ్చా? విద్యార్థులకు న్యాయ సహాయం అందిస్తామని పేర్కొంటూ.. దీప్కే నేతృత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ.. విరాళాలు సేకరించేందుకు ముందుకు వచ్చింది. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. చాలా మంది తటస్తులు విరాళాలు ఇచ్చారు. ఇలా.. విరాళాలు తీసుకోవచ్చా? ఇది చట్టబద్ధమేనా? కాకపోతే.. దీప్కేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తివారీ మరో పిటిషన్ వేశారు. ఇవన్నీ.. అధికారులు విచారణకు తీసుకున్నారు.
ముందే తెలుసు: దీప్కే
ఇలాంటివి వస్తాయని తమకు ముందే తెలుసునని దీప్కే తండ్రి భగవాన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. తాము ప్రతి రూపాయినీ నిజాయితీగానే సంపాయించామన్నారు. తమ కుమారుడు ఒకవైపు ప్రైవేటు ఉద్యోగం చూస్తూ.. అమెరికాలో చదువుకున్నారని తెలిపారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని అన్నారు. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టడంతోనే ఇవన్నీ వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయినా వెనక్కి తగ్గబోమని ఆయన చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
