కూటమి నేతలను సైతం వదలొద్దంటున్న పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు…మధ్య సమాజం పట్ల తనకున్న అవగాహన, సమాజం తీరుతెన్నులపై ఆయన స్పందించే తీరు తదితరాలపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అసలు పవన్ సిసలైన వైఖరి ఏమిటన్న విషయం ఇప్పటికే తెలుగు ప్రజలకు తెలిసే ఉంటుంది.

ప్రజలకు తెలిసిన తనలోని సిసలైన వైఖరిని ఇప్పుడు పవన్ బయటపెట్టేశారు. దానినే తన పాటనలోనూ అమలు చేసే దిశగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టే విషయంలో మనోడైనా నిబంధనల మేరకు కట్టి తీరాల్సిందేనంటూ పవన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తోంది.

సోమవారం అమరావతిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పన్ను రాయితీలు పొందిన సంస్థల గురించిన ప్రస్తావన రాగా… పవన్ ఆసక్తికర కామెంట్లు చేశారు.

“రూ.10 వేల జీతం తీసుకునే ఉద్యోగి వద్ద నుంచి ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేస్తున్నాం. మరి వందల కోట్ల రాబడిని అందుకుంటున్న సంస్థల నుంచి పన్ను రాబట్టలేకపోతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. నిబంధనల మేరకు అందరి నుంచి పన్ను రాబట్టాల్సిందే. ఈ తరహా పద్ధతిని ముందుగా మన ఎన్డీఏ, మన కూటమి పార్టీలకు చెందిన వారి నుంచే మొదలు పెడదాం. మనోళ్ల నుంచి పన్నులు రాబట్టి మన నిజాయతీని నిరూపించుకోవాలి కదా”… అంలూ పవన్ తనదైన శైలిలో చెప్పుకుపోయారు.

పంచాయతీలకు పన్నులు ఎగవేస్తున్న వాటిలో పరిశ్రమలు, విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావించిన సందర్భంగా పవన్ మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల నుంచి ఆయా ప్రైవేట్ విద్యా సంస్థలు క్రమం తప్పకుండా ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు.. ఆయా స్కూళ్లు ప్రభుత్వానికి, పంచాయతీలకు కట్టాల్సిన ట్యాక్స్ ను సరైన సమయంలో ఎందుకు కట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఉద్యోగులతో పాటు మత్స్యకారులు కూడా ప్రభుత్వానికి సకాలంలో పన్నులు చెల్లిస్తున్న నేఫథ్యంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు పన్నులు ఎగవేయడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సంస్థలు పన్నులు కట్టకుండా ఉంటే… వారి వద్ద నుంచి పన్నులు వసూలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు.

మొత్తంగా మార్పు దిశగా పవన్ దృష్టి సారించిన వైనం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పాలి. ఇటీవలే గోదావరి పుష్కరాల పరిశీలన సందర్భంగా పరిశ్రమలు తమ కాలుష్యాలను నదిలోకి ఎలా వదిలేస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ తాజాగా ఆయా సంస్థల పన్ను వసూళ్లపైనా దృష్టి సారించడం గమనార్హ.

ఏదైనా ఓ మాట పవన్ నుంచి బయటకు వచ్చిందంటే… దానిని తప్పకుండా అమలు చేసే దిశగా సాగుతున్న పవన్… ఇప్పుడు పరిశ్రమలు. ప్రైవేట్ విద్యాలయాల నుంచి కూడా పన్నులు రాబడతారన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో తన మన అన్న తేడా లేని విధంగా పవన్ వ్యవహరిస్తారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మరి పవన్ తీరును కూటమి పార్టీల నేతలు ఎలా తీసుకుంటారో చూడాలి.