ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. డీఎస్సీలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని, డీఎస్సీ నిర్వహణపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
జగన్ పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నాయి. ఈ క్రమంలో విద్యా శాఖ కమిషనరేట్ అధికారిణి ఇచ్చిన సమాధానంతో వైసీపీ శ్రేణులకు నోట మాట రాలేదు. వెరసి డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ పిలుపు మేరకు మెగా డీఎస్సీపై వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మంగళగిరిలోని రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయం ఎదుట ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.
నిరసన అనంతరం వారిని కార్యాలయంలోనికి అనుమతించగా… డీఎస్సీని రద్దు చేయాలంటూ ఓ వినతి పత్రాన్ని వారు విద్యా శాఖ కార్యాలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారి నుంచి వినతి పత్రం స్వీకరించిన విద్యాశాఖ అధికారిణి ఒకరు… వైసీపీ నేతలకు సమాదానం చెప్పిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో జగన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని టీవీ ఛానెల్ లోనే ప్రసారం కావడం గమనార్హం.
వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా మెగా డీఎస్సీలో అక్రమాలేమీ జరగలేదని సదరు విద్యా శాఖాధికారిణి చెప్పారు. అయితే ఆమె మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు కార్యాలయంలోనే ఆమెతో వాగ్వాదానికి దిగారు. దీంతో సహనం కోల్పోయిన సదరు అధికారిణి తాను చెప్పే విషయాలు శ్రద్ధగా ఆలకిస్తేనే తాను మాట్లాడతానని, లేదంటే కార్యాలయం నుంచి బయటకు దయచేయాలని కోరారు. దీంతో కాస్తంత తగ్గిన వైసీపీ నేతలు సదరు అధికారిణి చెప్పే విషయాలను ఆలకించారు.
మెగా డీఎస్సీలో భాగంగా ప్రశ్నాపత్రం తయారీలో పాలుపంచుకున్న నవీన్ అనే ఉద్యోగికి ఫస్ట్ ర్యాంకు వచ్చిందన్న ఆరోపణలపై స్పందించిన సదరు అధికారిణి… నవీన్ కు వచ్చింది మొదటి ర్యాంకు కాదని, అతడికి ఆరో ర్యాంకు వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా నవీన్ ను డీఎస్సీకి డిస్ క్వాలిఫై చేసినట్లు చెప్పారు.
నవీన్ డిస్ క్వాలిఫైకి సంబందించిన పూర్తి వివరాలనూ ఆమె వెల్లడించారు. పరీక్ష రాసే ముందు అతడు విద్యా శాఖ నుంచి ఎన్ వోసీ తీసుకోలేదని ఆమె తెలిపారు. అంతేకాకుండా… సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అతడు హాజరు కాలేదని తెలిపారు. ఈ రెండు కారణాలతో నవీన్ ను డీఎస్సీకి డిస్ క్వాలిఫై చేశామని ఆమె తెలిపారు. సాక్షాత్తు విద్యా శాఖాధికారిణి నోట నుంచే ఈ మేర విస్పష్ట సమాధానం రావడంతో వైసీపీ నేతలు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates