మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌… ఎప్పుడు సీఎం గారు?

తెలంగాణ‌లోని సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు.. ముహూర్తం సిద్ధ‌మైందా? వ‌డివ‌డిగా నిర్ణ‌యాలు తీసుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాజాగా ఢిల్లీలో ఈ వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున క‌ద‌లిక వ‌చ్చింద‌ని స‌మాచారం. మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ ఈ నెల‌లోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే.. ఏదైనా భారీ అవాంత‌రం వ‌స్తే.. వ‌చ్చే నెల 15లోగా ఖ‌చ్చితంగా మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని తెలుస్తోంది.

బీసీ సామాజిక వ‌ర్గానికి ఈ ద‌ఫా పెద్ద‌పీట వేయాల‌ని కాంగ్రెస్ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇప్ప‌టికే 43 శాతం మంది బీసీలు ఉన్నార‌ని లెక్క తేలిన ద‌రిమిలా.. వారికి సానుకూల‌మైన రీతిలో ప‌ద‌వులు ద‌క్క‌డం లేదన్న వాద‌న ఉంది. దీని నుంచి బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బీసీల‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. సీఎం రేవంత్ కూడా..దీనికి సానుకూలంగానే ఉన్నారు.

ఇటీవ‌ల మ‌రోసారి తానే ముఖ్య‌మంత్రి అవుతాన‌ని రేవంత్ చేసిన ప్ర‌క‌ట‌న ద‌రిమిలా.. బీసీల్లో కొంత మేరకు అస‌హ‌నం ఏర్ప‌డింది. దీనిని త‌గ్గించేందుకు వారిని సంతృప్తి ప‌రిచేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే.. మంత్రివ‌ర్గం ద్వారా మార్గం సుగమం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇక‌, ఎస్సీ, ఎస్టీల జాబితా కూడా పెద్ద‌దిగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఈ ద‌ఫా.. కొంత ప‌క్క‌న పెట్ట‌నున్నారు. ఈ జాబితాలో ఇప్ప‌టికే న‌లుగురు మంత్రులు ఉన్న విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు.. రెడ్డి సామాజిక వ‌ర్గంలో కూడా మంత్రి వ‌ర్గంపై ఆశ‌లు పెట్టుకున్న వారి జాబితా పెద్ద‌దిగానే ఉంది. అయితే.. ఇప్ప‌టికే రెడ్డి నాయ‌కుల మెజారిటీ భాగ‌స్వామ్యం ఉండ‌డంతో ఈ సామాజిక వ‌ర్గానికి పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌చ్చ‌న్న అంచ‌నాలు వున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి గ‌త కొన్నాళ్లుగా అమాత్య పీఠంపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఇలా.. మ‌రికొంద‌రు కూడా ఉన్నారు. దీంతో రెడ్డి వ‌ర్గాన్ని ఏం చేస్తార‌న్న‌ది చూడాలి. ఏదేమైనా.. ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు రెండున్న‌రేళ్లు పూర్తవుతున్న ద‌రిమిలా.. మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఖాయంగా క‌నిపిస్తోంది.