వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకా నందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి ఆయన కుమార్తె, డాక్టర్ నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లిలోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. “ఇంకా సాగదీయడం సరికాదు. ఇక చాలు.“ అని కోర్టు వ్యాఖ్యానించినట్టు సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే.. తన తండ్రి హత్యకు సంబంధించి న్యాయం జరిగే వరకు తన పోరు ఆగదని సునీత స్పష్టం చేశారు. ఈ విషయంలో మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. దీంతో వివేకా హత్య కేసు వ్యవహారంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.
తాజా కేసు ఏంటి?
తాజా ఘటన విషయానికి వస్తే.. 2019, మార్చిలో వివేకా.. పులివెందులలోని తన సొంత ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. దీనిని సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేసింది. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో వందలాది మంది సాక్షులను సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం.. గత ఏడాదే చార్జి షీట్ కూడా దాఖలు చేశారు. అయితే.. ఈ కేసులో నిందితులు అనేక మంది ఉన్నారని.. వారిని కూడా విచారించాలని సునీత కోరారు. కానీ, సీబీఐ తన గోడు వినిపించుకోలేదని పేర్కొంటూ ఆమె.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఈ క్రమంలో ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక, తెలంగాణ హైకోర్టు ఈ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసింది. ఈ క్రమంలో గత ఏడాదే సీబీఐ అధికారులు సునీత అనుమానం వ్యక్తం చేసిన వారిని కూడా విచారించారు. అనంతరం.. మరోచార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. అయినప్పటికీ.. మరింత లోతుగా విచారించలేదని.. తాను చెప్పిన నిందితుల ఫోన్లను కూడా సీబీఐ అధికారులు పరిశీలించలేదని సునీత మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపైనే తాజాగా విచారణ జరిగింది.
సీబీఐ వాదన ఇదీ..
సునీత పేర్కొన్న అందరు నిందితులను తాము సమగ్రంగానే విచారించామని సీబీఐ పేర్కొంది. వారికి.. వివేకా హత్యకు ఎలాంటి లింకు లేదని సీబీఐ అధికారులు చెప్పారు. ఈ మేరకు తాజాగా మరో అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతరం.. దీనిపై విచారణ చేసిన నాంపల్లి కోర్టు.. సునీత పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్టు పేర్కొంది. ఈ సమయంంలో కోర్టులోనే ఉన్న సునీత.. తీవ్ర భావోద్వే గానికి గురయ్యారు. తన తండ్రికి అన్యాయం జరుగుతోందని, న్యాయ మూర్తి మరోసారి పరిశీలించాలని కోరారు. అయితే.. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించారని.. ఇంకా విచారణను పొడిగించడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక, సీబీఐ మాత్రం కోర్టు ఆదేశిస్తే.. మరోసారి విచారణ చేస్తామని చెప్పింది. దీనికి కోర్టు అంగీకరించలేదు. దీంతో సునీత పిటిషన్ రద్దయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates

