మంగాపురంకు చిక్కు వచ్చేలా ఉందే  

ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురంకు ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ లేదన్నది వాస్తవం. హీరో జయకృష్ణ ఘట్టమనేనికి బలమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా మహేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగేంత వరకు ఊపొచ్చేలా లేదు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకురావడం ద్వారా అమాంతం హైప్ పెంచవచ్చనే ఆలోచనలో టీమ్ ఉంది. అయితే ఒక చిక్కు వచ్చేలా ఉంది.

వారణాసితో చాలా బిజీగా ఉన్న మహేష్ బాబు డేట్స్ అంత సులభంగా దొరికే పరిస్థితి లేదట. ఓ రెండు గంటలు తీరిక చేసుకుని అటెండ్ కావొచ్చు కానీ అది ఎంత మేరకు సాధ్యమవుతుందో చెప్పలేమని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికైతే వస్తున్నట్టు రానట్టు ఎలాంటి అధికారిక ప్రకటన టీమ్ నుంచి రాలేదు. నిర్మాతలు వీలైనంత వరకు ట్రై చేస్తున్నారు కానీ నిజంగా పనవుతుందో లేదో చెప్పలేం. ఇది మిస్ అయినా సక్సెస్ మీట్ కు వస్తానని మహేష్ హామీ ఇచ్చినట్టు టాక్.

కానీ ప్రీ రిలీజ్ టైంలోనే ఈ సినిమాకు మహేష్ మద్దతు కావాలి. ఎందుకంటే దర్శకుడు అజయ్ భూపతి బ్రాండ్ మీద ఓపెనింగ్స్ రావు. కొత్త కుర్రాడు కాబట్టి టాక్ వచ్చే దాకా మాస్ జనాలు ఎదురు చూస్తారు. పూర్తి వివరాలు తెలుసుకునే దాకా ఫ్యామిలీ ఆడియన్స్ కదలరు. వీళ్లందరిలో మూమెంట్ రావాలంటే అది ఒక్క మహేష్ ఎంట్రీతోనే సాధ్యమవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. ఆయన వస్తారని జయకృష్ణ ఆ మధ్య చెప్పాడు కానీ ఇంకా అఫీషియల్ స్టాంప్ పడలేదు.

లెనిన్ తర్వాత మాస్ కంటెంట్ తో వస్తున్న సినిమా శ్రీనివాస మంగాపురమే. చెన్నై లవ్ స్టోరీ మధ్యలో ఉంది కానీ అది ఎమోషనల్ జానర్ కాబట్టి ఈ క్యాటగిరీలో వేయలేం. జయకృష్ణకు ఈ మూవీ సక్సెస్ అయితేనే పునాది బలంగా పడినట్టు. లేదంటే అవకాశాలు వస్తాయి కానీ జనం సపోర్ట్ దక్కడానికి ఎక్కువ టైం పడుతుంది. తండ్రి రమేష్ బాబు హీరోగా సుదీర్ఘ కాలం కొనసాగలేకపోయిన నేపథ్యంలో ఆ లోటు తీర్చాల్సిన బాధ్యత జయకృష్ణ మీదుంది. తొలి అడుగులు వేయించాల్సింది మహేష్ బాబే.