కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనపై ఆర్ ఎస్ ఎస్ అంతర్మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది. ఆర్ ఎస్ ఎస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి.. విద్యార్థులకు మద్దతుగా స్పందించడంతో ఈ వ్యవహారం బీజేపీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి.. బీజేపీ విధానపరమైన నిర్ణయాల వెనుక ఆర్ ఎస్ ఎస్ ఉంటుందని అంటారు. తాజాగా విద్యార్థి ఉద్యమాలు చేపట్టాక.. బీజేపీ వైఖరిపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.
ప్రధానంగా ఢిల్లీలో జరిగిన ఉద్యమాలను ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాలలో కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించాలని ఆర్ ఎస్ ఎస్ ఆది నుంచి ఒత్తిడి పెంచింది. కానీ.. ప్రస్తుత సమావేశాలు మాత్రం చర్చలకు ఎలాంటి అవకాశం లేకుండా విమర్శలు, నినాదాలతోనే వాయిదాల పర్వంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యానికి తోడు విద్యార్థులు తమ నిరసనలను ఎక్కడా ఆపక పోవడం, కేంద్ర మంత్రి రాజీనామాకు పట్టుబట్టడం వంటివి కూడా ఆర్ ఎస్ ఎస్ చర్చల్లో ప్రధానంగా తెరమీదికి వచ్చాయి. ఈ క్రమంలో ఒక్కరి కోసం ఎందుకీ రచ్చ అన్న ధోరణిని నాయకులు వినిపించినట్టు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి చేసిన వ్యాఖ్యలు.. ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చినవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులకు తాము మద్దతుగా ఉంటామని, వారి ఆందోళనలను పరిష్కరించాలని, చర్చించాలని ఆయన సూచించారు. అంతేకాదు.. విద్యార్థుల ఉద్యమంలోనూ పస ఉందన్నారు. ఈ పరిణామాలు బీజేపీకి చెందిన సీనియర్ నేత నుంచే బయటకు రావడం.. పైగా ఆయనకు ఆర్ ఎస్ ఎస్‌కు మధ్య బలమైన సంబంధాలు కూడా ఉండడంతో ప్రధాని మోడీ వైఖరిపై ఆర్ ఎస్ ఎస్ గుస్సాగా ఉన్నట్టు స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
కేంద్ర మంత్రిపై అదే వాదన..
ఇక, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంపై కేంద్రం బలమైన నిర్ణయమే తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో రాజీనామా చేయించే ప్రసక్తి లేదని ప్రధాని మోడీ స్పష్టం చేసినట్టు తెలిపాయి. మంత్రితో రాజీనామా చేయించినప్పటికీ సమస్య పరిష్కారం కాదని, తాము సమస్య పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ధర్మేంద్రను సేఫ్ చేస్తున్నారు. ఇది కూడా.. ఆర్ ఎస్ ఎస్‌కు నచ్చడం లేదని అంటున్నారు. అయితే.. ధర్మేంద్రను రాజీనామా చేయిస్తే.. తప్పు ఒప్పుకొన్నట్టు అవుతుందని, త్వరలోనే జరగనున్న రాష్ట్రాల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

