కోమటి బ్రదర్స్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

తెలంగాణలో అధికార పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో తరచూ అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. ఎనుముల రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత అధికార పార్టీలో ఈ తరహా విభేదాలు చాలా సార్లే కనిపించినా… తాజా వివాదం మాత్రం ఓ రేంజికి ఎగసిందని చెప్పాలి. అంతేకాకుండా గతంలో మాదిరిగా కాకుండా… ఈ దఫా ఎగసిన వివాదం బహిరంగంగా పెచ్చరిల్లింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మీద సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే…అది కూడా ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఓ రేంజిలో ఫైరైపోయారు. 

ఈ వివాదానికి దారి తీసిన కారణాలేమిటన్న విషయంలోకి వెళితే… సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన దళిత నేత మందుల సామేల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో స్థానిక కమిటీలను ఆయనకు తెలియకుండానే… మంత్రి కోటమిరెడ్డి ప్రకటించారట. ఈ ప్రకటనపై మంత్రి నుంచి గానీ, పీసీసీ నుంచి గానీ ఎమ్మెల్యేకు ఎలాంటి సమాచారం లేదట. దీంతో ఈ ప్రకటనలపై మందుల సామేల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురయ్యారు. 

తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా పార్టీ కమిటీలను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించేందుకు శుక్రవారం మందుల సామేల్ ఏకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన బలగంతో కలిసి వచ్చిన సామేల్… వచ్చీ రావడంతోనే కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఆయన నేరుగా సంచలన వ్యాఖ్యలు గుప్పించారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో మంత్రి గానీ, ఎంపీ గానీ ఎలా అడుగుపెడతారని ఆయన ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యేలంటేనే లెక్క లేని విధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీలకు ఫిర్యాదు చేస్తానని సామేల్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ తరహా వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ఛీప్ మహేశ్ కుమార్ గౌడ్ లు ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు. పార్టీ విధానం ప్రకారం కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరించకుండా… బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను అవమానిస్తూ సాగుతూ ఉంటే… రేవంత్ గానీ, మహేశ్ గౌడ్ కూడా స్పందించరా? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై వారిద్దరూ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తమ తీరు మార్చుకోకపోతే… వారిద్దరిపై చాపు డప్పు మోగిస్తానని కూడా సామేల్ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు.