కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు వేసుకుని, ప్రాక్టికల్ గా అలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాని ప్రతిసారి మంచి ఫలితాలు వస్తాయా అంటే దానికీ గ్యారెంటీ లేదు. అయితే కిరణ్ అబ్బవరం మాత్రం ఈ విషయంలో క్యాలికులేషన్లు పక్కనపెట్టి ముందుకు వెళ్లడం నటుడిగా ప్రమోషన్ ఇవ్వడమే కాదు కెరీర్ పరంగా ప్లస్ అయ్యే సినిమాలను తీసుకొస్తోంది. వాటిలో భాగంగా వచ్చిందే చెన్నై లవ్ స్టోరీ.
ముందీ కథను బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలయికలో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఏవో కారణాల వల్ల వాళ్లిద్దరూ తప్పుకోవడంతో ఆ స్థానంలో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియా వచ్చి చేరారు. కట్ చేస్తే ఈ స్టోరీకి వాళ్ళెంత ప్లస్ అయ్యారో సినిమా చూస్తే అర్థమవుతుంది. పెర్ఫార్మన్స్ పరంగా కిరణ్ చాలా మెరుగయ్యాడు. ముఖ్యంగా ఎనర్జీ డిమాండ్ చేసే స్టీవెన్ శంకర్ రూపంలో అలవోకగా పరకాయ ప్రవేశం చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.
కథ పరంగా హీరోయిన్ డామినేషన్ ఎక్కువ అనిపించినప్పటికీ తన ఉనికిని చాటుకోవడంలో కిరణ్ అబ్బవరం తీసుకున్న చొరవ, చేసుకున్న ఇంప్రూవ్ మెంట్ తెరమీద స్పష్టంగా కనిపించింది. ఫస్టాఫ్ లో చలాకీగా, సెకండాఫ్ లో ఎమోషన్ ప్లస్ అనుమానంతో రగిలిపోయే ప్రేమికుడిగా రెండు షేడ్స్ బాగా బ్యాలన్స్ చేశాడు. ఒకదశలో శ్రీగౌరీ ప్రియాతో పోటాపోటీగా నడిచిన సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఇదేదో పొగిడేందుకు కాదు స్క్రీన్ మీద కనిపించిన వాస్తవమే.
కమర్షియల్ గా చెన్నై లవ్ స్టోరీ ఎక్కడిదాకా వెళ్తుందనేది అప్పుడే చెప్పలేం కానీ ఓపెనింగ్స్ అయితే బాగున్నాయి. టాక్ మిక్స్డ్ నుంచి పాజిటివ్ వరకు అన్ని రకాలుగా వినిపిస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందనే దాన్ని బట్టి స్టేటస్ ఆధారపడి ఉంటుంది. ఎలాగూ మార్కెట్ లో కాంపిటీషన్ లేదు. లెనిన్ నెమ్మదించింది. జన నాయకుడు హడావిడి రెండు మూడు రోజులే. ఇంకో రెండు వారాల దాకా గ్రౌండ్ ఫ్రీనే. మరి స్టీవెన్ శంకర్ ఏ మేరకు వాడుకుంటాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates

