పవిత్ర గోదావరి పుష్కరాలకు సమయం ఆసన్నమవుతోంది. మరో ఏడాదిలో జరగనున్న ఈ పుష్కరాల కోసం అటు తెలంగాణ సర్కారుతో పాటుగా ఇటు ఏపీ సర్కారు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజమహేంద్రవరం వేదికగా జరుగుతున్న పుష్కర ఏర్పాట్లను జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కారాలను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధంగా లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోదావరి పుష్కరాలంటే… ఒక్క రాజమహేంద్రవరం పరిధిలోనే పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తే సరిపోదని పవన్ అభిప్రాయపడ్డారు. గోదావరి వెంట ఉన్న వందలాది గ్రామాల్లోనూ పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. 12 ఏళ్లకోమారు వచ్చే పుష్కరాలను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందు నుంచే చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం పుష్కరాల కోసం జరుగుతున్న పనులు నిర్దేశిత సమయం లోగా పూర్తి అయ్యే సూచనలు కనిపించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యేకించి పుష్కర ఘాట్ల నిర్మాణంపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాసిరకం సిమెంట్ తో హడావిడిగా పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పుష్కర ఘాట్లు జనం తాకిడితో కూలిపోవడం ఖాయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పుష్కర ఘాట్ల ఏర్పాటు పనుల్లో వేగమే లేదన్న పవన్… ఇలాగైతే పుష్కరాల సమయానికి ఘాట్ల నిర్మాణం పూర్తి కాదని తెలిపారు. అయినా ఒక ప్రణాళిక అంటూ లేకుండా పనులను ఎలా అనుమతించారని ఆయన అధికారులను నిలదీశారు.
గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీకి కేంద్రం నుంచి రూ.8,300 కోట్లు రానున్నాయని పవన్ చెప్పారు. అయితే ప్రస్తుతం గోదావరి తీరం వెంట జరుగుతున్న పనులను చూస్తే కేంద్రం నుంచి నిధులు విడుదల అయ్యే అవకాశమే కనిపించడం లేదన్నారు.
ఇచ్చిన నిధులను ఇష్ఠానుసారంగా ఖర్చు చేస్తామంటే కేంద్రం ఒప్పుకోదన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని ఆయన సూచించారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలని, అప్పుడే పుష్కరాలను సజావుగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఈ అన్ని అంశాలపై త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో తాను ప్రస్తావిస్తానని పవన్ చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates