ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను అవమానించారని చెప్పడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. జైలు వద్ద జగన్ కు ఎలాంటి అవమానం జరగలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహారించామని జైలు సిబ్బంది వివరణ ఇచ్చారు. అధికార కూటమి ప్రభుత్వం కూడా జగన్ ప్రకటనను ఖండించింది.
ఎమ్మెల్యే విరూపాక్షిని పరమార్శించేందుకు జగన్ కర్నూలు వెళ్లారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ర్యాలీగా జైలు వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యేని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత తాను మాజీ ముఖ్యమంత్రినని, అయినప్పటికీ జైలు అధికారులు తనను అవమానించారని చెప్పారు.
జైలు లోపలకు ములాఖత్ కు వెళ్లే ముందు కెమెరాతో ఫోటో తీసుకుంటారని, లోపలకు వెళ్లిన తర్వాత నిబంధనలు ప్రకారం కూర్చోబెట్టి ఫోటోలు తీసుకోవాల్సి ఉండగా గ్రిల్ బయట నిలబెట్టి ఫోటోలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జైలు అధికారులను ప్రశ్నించగా పై నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారని తెలిపారు. ఇదిప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దాంతో జైలు అధికారులు వివరణ ఇచ్చారు.
జైలు నిబంధనల ప్రకారమే జగన్ ఫోటో తీసుకొని మూలాఖత్ కు పంపించినట్లు జిల్లా జైలు సూపరెండెంట్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. జగన్ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. జగన్ జైల్లో వున్న ఎమ్మెల్యే విరూపాక్షితో పాటుగా ఆయన తమ్ముడు శ్రీరాములును కలిసేందుకు అనుమతి కోరినట్లు చెప్పారు. ఈ – ప్రిజన్స్ సాఫ్ట్ వేర్ ప్రకారం ఎంతమంది ముద్దాయిలను కలిసేందుకు అనుమతి కోరారో అన్నీ సార్లు ఫొటోలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే రెండు సార్లు ఫోటోలు తీసుకున్నట్లు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాకు భంగం కలిగించలేదన్నారు.
జైలు సూపరెండెంట్ వివరణ ఇచ్చినప్పటికి చర్చ కొనసాగుతూనే వుంది. వైసీపీ శ్రేణులు జగన్ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పెడుతున్నారు. టీడీపీ, జనసేన నాయకులు జైలు సూపరెండెంట్ వివరణను పోస్ట్ చేస్తున్నారు. జైలు అధికారులు స్వయంగా క్లారిటీ ఇచ్చినందున ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని మేధావులు సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates