టాలీవుడ్ సినిమాల ప్లానింగ్ ఎలా ఉందంటే ఒక ఏడాది ముందే సంక్రాంతి రిలీజులకు సిద్ధమయ్యేంత. ఈ విషయంలో అనిల్ రావిపూడి అందరికన్నా ముందున్న సంగతి తెలిసిందే. చిరంజీవి వెంకటేష్ లాంటి పెద్ద హీరోలతో చేస్తున్నా సరే డేట్ అందుకోవడంలో తగ్గేదేలే అంటూ వ్యవహరిస్తున్న ఈ ఫాస్ట్ డైరెక్టర్ ట్రాక్ రికార్డులో ఇప్పటిదాకా ఫ్లాపులు లేవు. సంవత్సరం మొత్తంలో భారీ రెవిన్యూ ఇచ్చే సీజన్ అదే కావడంతో అనిల్ తో పాటు ఇతర డైరెక్టర్లు కూడా సంక్రాంతికి టార్గెట్ చేసుకుంటున్నారు.
ఆల్రెడీ వెంకీ కళ్యాణ్ రామ్ కాంబో మూవీ రెండో షెడ్యూల్ లోకి వెళ్ళిపోయింది. నాగార్జున కింగ్ 100 ప్రకటన నాగార్జున పుట్టినరోజు నాడు రానుంది. శర్వానంద్ శీనువైట్ల కలయికలో వస్తున్న జార్జ్ క్రిష్ ఏకంగా జనవరి 14 లాక్ చేసేసుకుంది. చిరంజీవి – బాబీ కూడా వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ రిపీట్ చేయడం కోసం సంక్రాంతికే ఫిక్స్ అవుతున్నారట. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాని రవితేజ శ్రీవిష్ణు మల్టీస్టారర్ అదే టైంలో రావొచ్చనే ప్రచారం జోరుగా తిరుగుతోంది.
అయితే హ్యాపీ పొంగల్ పేరుతో ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్టుగా మారుతీ గురించి నాలుగైదు నెలల క్రితమే టాక్ వచ్చింది. కానీ హీరో సెట్ కాకపోవడంతో ఆలస్యమవుతోందని ఇన్ సైడ్ టాక్. రాజా సాబ్ దారుణంగా డిజాస్టర్ కావడం మారుతీ మీద ప్రభావం చూపించింది. ఇలాంటి ఫ్లాపులు అందరికీ అనుభవమే కానీ రిలీజ్ కు ముందు మారుతీ చెప్పిన అతిశయోక్తి మాటలు, ఇంటి అడ్రెస్ పబ్లిక్ వేడుకలో చెప్పుకోవడం లాంటివి సోషల్ మీడియాలో నెగటివిటీ తీసుకొచ్చాయి.
సమస్య ఏమిటంటే మారుతీ ఒకప్పటిలా మరీ చిన్న హీరోలతో తీయలేడు. సంతోష్ శోభన్ తో మంచిరోజులు వచ్చాయి తీశాడు కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. అందుకే టయర్ 2 స్టార్స్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్టు వినికిడి. చిరంజీవి నుంచి రవితేజ దాకా కొందరు హీరోలకు కథలు చెప్పేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. ఎవరితో ఓకే అయినా కేవలం అయిదు నెలల్లో సినిమా పూర్తి చేయగలరా అంటే డౌటే. మరి కొత్త మారుతీ కొత్త సినిమాకు ముహూర్తం ఎప్పుడు పెడతారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates