వెనుకాడొద్దు… వెంటాడండి: మంత్రుల‌కు బాబు హుకుం!

వైసీపీ చేస్తున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక రాజ‌కీయాల‌ను మంత్రులు అస్సలు ఉపేక్షించ‌వ‌ద్ద‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఎక్క‌డా వెనుకాడ‌వ‌ద్ద‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. వెంటాడాల్సిందేన‌ని..  వైసీపీ చేసిన త‌ప్పుల‌కు సంబంధించిన ఆధారాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయ‌ని చెప్పారు. వైసీపీ నాయ‌కులు త‌మ పాల‌న‌లో జ‌రిగిన త‌ప్పుల‌ను మ‌రిచిపోయి.. ఇప్పుడు ఏమీ జ‌ర‌గ‌క‌పోయినా.. ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే కార్య‌క్ర‌మాల‌కు దిగుతున్నార‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో వైసీపీని వెంటాడాల్సిందేన‌ని మంత్రుల‌కు తేల్చి చెప్పారు.

గురువారం మ‌ధ్యాహ్నం అందుబాటులో ఉన్న మంత్రుల‌తో సీఎం చంద్ర‌బాబు రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నాయ‌కులు చేస్తున్న నిర‌స‌న‌లు, పోలీసుల నిబంధ‌న‌లు సైతం అతిక్ర‌మిస్తున్న తీరు వంటివి చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో నిర్వ‌హించిన గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల స‌మాధాన ప‌త్రాల‌ను ఎవ‌రితో బ‌డితే వారితో దిద్దించార‌ని.. అత్యంత దారుణ‌మ‌ని హైకోర్టు చేసిన వ్యాఖ్యల ను కూడా మంత్రులు సీఎం దృష్టికి తెచ్చారు.

వైసీపీ హ‌యాంలో గ్రూప్‌-1 ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అయితే.. మెయిన్స్ స‌మాధాన ప‌త్రాల‌ను హాయ్‌ల్యాండ్‌లో దిద్దించ‌డం.. ఈ స‌మ‌యంలో ఏమాత్రం అర్హ‌త లేనివారితో వాటికి మార్కులు వేయించ‌డం వంటివి వెలుగు చూశాయి. దీంతో ఈ ప‌రీక్ష‌ల ఆధారంగా ఉద్యోగాలు పొందిన డీఎస్పీ స‌హా.. ఇత‌ర అధికారుల‌ను హైకోర్టు ఇప్ప‌టికే అప్రాధాన్య పోస్టుల‌కు బ‌దిలీ చేయాల‌ని ఆదేశించింది. తాజాగా దీనిపై విచార‌ణ చేసిన అధికారులు త‌ప్పులు జ‌రిగాయ‌ని.. క‌నీస అర్హ‌త లేనివారితోనూ మూల్యాంకనం చేయించార‌ని తేల్చారు. అంతేకాదు.. దీనికి గాను కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశార‌ని పేర్కొన్నారు.

ఆయా అంశాల‌పై స్పందించిన చంద్ర‌బాబు.. “మ‌నం ఎంతో పార‌దర్శ‌కంగా డీఎస్సీ-2025 నిర్వ‌హించాం. ప్ర‌తి విష‌యాన్ని డ్యాష్‌బోర్డులో పెట్టాం. హైకోర్టు కూడా ఒక సంద‌ర్భంలో మెచ్చుకుంది. మంత్రి లోకేష్ బాగా ప‌నిచేస్తున్నార‌ని కూడా కితాబు ఇచ్చింది. అలాంటి ప‌రీక్ష‌పై వైసీపీ నిర‌స‌న‌లు చేస్తోంది. కానీ, గ్రూప్‌-1ను అడ్డం పెట్టుకుని నిరుద్యోగుల‌ను మోసం చేసిన తీరును మాత్రం మ‌రిచిపోతున్నారు. మీరు(మంత్రులు) ఏమాత్రం వెన‌క్కి త‌గ్గొద్దు. వెంటాడండి. వారు చేసిన త‌ప్పుల‌ను ఎత్తి చూపండి. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లండి. గ్రూప్‌-1 త‌ప్పుల‌పైనా.. వైసీపీ చేసిన ద్రోహంపై చ‌ర్చ పెట్టండి.“ అని సీఎం దిశానిర్దేశం చేశారు.