దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. తాజాగా రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఏపీకి సంబంధించి 4 స్థానాలు ఉండడం గమనార్హం. ఈ ఎన్నికలు మొత్తం 10 రాష్ట్రాల్లో జరగనున్నాయి. అయితే.. కొన్ని స్థానాలు జూన్‌లోను, మరికొన్ని స్థానాలు జూలైలోనూ ఖాళీ కానున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు నెలల్లోనూ ఖాళీ అయ్యే స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఒకే సారి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం.. జూన్, జూలైలో ఖాళీ అయ్యే స్థానాలకు.. జూన్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. జూన్ 8వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉంటుంది.
అనంతరం.. జూన్ 9న నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక, నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉపసంహరించుకునేందుకు అదే జూన్ 11వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. జూన్ 18వ తేదీన ఒకే రోజు 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఈ ప్రక్రియ మొత్తం జూన్ 20వ తేదీ కల్లా.. ముగియనుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
తాజా ఎన్నికల్లో ఏపీలోని నాలుగు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్‌ల పదవీ కాలం జూన్ 21న ముగియనుంది. దీంతో ఏపీలో ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నాలుగు స్థానాలు కూడా అధికార కూటమి పార్టీలకే దక్కనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates