యాక్షన్ కు రియాక్షన్ – తాట తీసిన పోలీసులు

రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. కన్నూ మిన్నూ కానకుండా విచ్చలవిడిగా దారుణాలకు పాల్పడుతుంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తుంది.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో గంజాయి బ్యాచ్ ఒక హెడ్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని కొట్టడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పోలీసులు వాడి యాక్షన్ కు తగినట్లుగానే రియాక్షన్ చూపించారు. అయినప్పటికీ పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి సంగతేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో గంజాయి మత్తులో వున్న ఒక యువకుడు జనం రద్దీగా వున్న రోడ్డులో తిరుపతి ఒన్ టౌన్ లో హెడ్ కానిస్టేబుల్ రమణయ్య చొక్కా పట్టుకొని దాడి చేయడం కనిపించింది. చుట్టూ వున్న జనాలు నువ్వు తప్పు చేస్తున్నావ్.. కానిస్టేబుల్ ను విడిచిపెట్టమంటూ బతిమాలడం వినిపిస్తుంది. అయినప్పటికీ గంజాయి బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ రమణయ్యను విడిచి పెట్టలేదు. పైగా కత్తి తీసుకొని పొడిచేందుకు వెంట పడ్డాడు. వారిని ధైర్యంగా ఎదుర్కొన్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్య వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు.

రమణయ్య సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గంజాయి సేవించి దాడికి పాల్పడిన యువకుడికి తాట తీశారు. చేతికి సంకెళ్లు వేసి వీధుల్లో నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు పిలుచుకొని వెళ్లారు. పోలీసు మీద దాడికి పాల్పడిన గంజాయి బ్యాచ్ కు బయటకు రాకుండా జైలులో పడేయాలని జనం విజ్ఞప్తి చేస్తున్నారు.