బాబు `లైట్` తీసుకుంటే… న‌ష్టం త‌ప్ప‌దా?!

ఏముందిలే.. అని లైట్ తీసుకుంటే.. రాజ‌కీయాల్లో కుదిరే ప‌నికాదు. ఏ విష‌యాన్న‌యినా.. సీరియ‌స్‌గానే తీసుకోవాలి.. సిన్సియర్‌గానే ఆలోచించాలి. లేక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇప్పుడు తెలంగాణ విష‌యంలో చంద్ర‌బాబు లైట్ తీసుకుంటున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌త నాలుగు రోజులుగా తెలంగాణ ప్ర‌భుత్వం పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విష‌యంపై యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్చ‌లు చేస్తోంది. దీనిని నిర్మించి తీరుతామ‌ని కూడా.. తెలంగాణ జ‌ల‌వ‌న‌రుల మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి చెబుతున్నారు. మ‌రోవైపు.. కేంద్రం కూడా దీనికి స‌మ్మ‌తించిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి.

అంతేకాదు.. ఏపీ ప్ర‌భుత్వం కూడా.. పాల‌మూరు-రంగారెడ్డి విష‌యంపై నిర్ణ‌యం తీసుకుని.. స‌మ్మ‌తి తెల‌పాల‌న్న ఒత్తిడి కూడా కేంద్రం నుంచి వ‌స్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబుకు కేంద్ర‌మే చెప్పిన‌ట్టు నాలుగు రోజుల కింద‌టే వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామం త‌ర్వాత‌.. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో దూకుడు పెంచింది.

అయితే.. ఏపీ మాత్రం ఈ విష‌యంలో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో మ‌హార‌ష్ట్ర ప్ర‌భుత్వం కూడా.. ఇలానే ప్రాజెక్టుల ఎత్తును పెంచిన‌ప్పుడు.. మౌనంగా ఉన్నారు. త‌ర్వాత‌.. ప్ర‌జాగ్ర‌హం పెల్లుబికి.. తీవ్ర నిర‌స‌న‌ల‌కు దారి తీసిన‌ప్పుడు చంద్ర‌బాబు అక్క‌డ‌కు వెళ్లి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కానీ ఫ‌లితం క‌నిపించ‌లేదు.

ఇక‌, ఇప్పుడు పాల‌మూరు-రంగారెడ్డిపై ఏపీ నిర్ణ‌యం ఏంట‌నేది తెలియ‌క‌పోగా.. మ‌రోవైపు తెలంగాణ దూకుడు పెంచేసింది. ఈ క్ర‌మంలో తెలంగాణ రంగంలోకిదిగి.. నిర్మాణం ప్రారంభించే వ‌ర‌కు వేచి చూస్తే.. అది ఏపీకి.. ముఖ్యంగా చంద్ర‌బాబుకు కూడా వ్య‌క్తిగ‌తంగా ఇబ్బందులు వస్తాయి.

పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కృష్ణాన‌దిపై నిర్మించాల‌నేది ప్ర‌ణాళిక‌. ఇదే జ‌రిగితే.. కీల‌క‌మైన రాయ‌ల‌సీమ జిల్లాలకు నీరు అందే ప‌రిస్థితి ఉండ‌దు. అంతేకాదు.. కీల‌క‌మైన శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా నీరు త‌గ్గిపోయి.. విద్యుత్ ఉత్ప‌త్తి నుంచి కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతంలో పొలాల‌కు నీరు చేసే అవ‌కాశం కూడా లేకుండా పోతుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ ఈ విష‌యంపై సాధ్య‌మైనంత త్వ‌ర‌గా స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. జ‌ల‌వ‌న‌రుల నిపుణులు చెబుతున్నారు.

స‌గం రాష్ట్రంపై ప్ర‌భావం..

పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు పుంజుకుంటే.. అది ఏపీలోని ఉమ్మ‌డి 7 జిల్లాల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. రాయ‌ల‌సీమ‌లో మూడు.. నెల్లూరు, గుంటూరు, కృష్ణా స‌హా.. చెన్నైకి తాగునీరు అందించే అవ‌కాశం కూడా కోల్పోతామ‌ని చెబుతున్నారు.

శ్రీశైలం ద్వారా ఉత్ప‌త్తి అవుతున్న జ‌ల విద్యుత్‌పైనే ఇప్పుడు రాష్ట్రంలోని స‌గం జిల్లాలు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని.. పాల‌మూరు క‌నుక ప్రాణం పోసుకుంటే.. విద్యుత్‌క‌ష్టాలు కూడా త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఈ విష‌యంపై ముందుగానే స్పందించాల‌ని కోరుతున్న‌వారి సంఖ్య పెరుగుతోంది.