ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను తప్పు చేసినట్టుగా ఒప్పేసుకున్నారు. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ పార్టీ పీఏసీ చైర్మన్, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లు కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసినట్లుగా ఇటీవలే నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా జగన్ ను అరెస్టు చేయాలని పవన్ కోరితే… అందుకు నో చెప్పిన అమిత్ షా… చంద్రబాబు తమకు పార్ట్ టైం మిత్రుడని, జగన్ లాంగ్ టైం మిత్రుడని షా చెప్పినట్లుగా నాగేశ్వర్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకే తెర తీశాయి. అయితే గురువారం తాను చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటున్నట్లు నాగేశ్వర్ స్వయంగా ప్రకటించారు.
ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చలో పాలుపంచుకున్న సందర్భంగా ఈ అంశంపై నాగేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. పవన్, నాదెండ్లపై తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి బేషజాలు గానీ, ఎలాంటి శషబిషలు లేకుండా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంలో తనకు ఓ వ్యక్తి ద్వారా సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని పరిశీలించకుండానే తాను వాటిని అలాగే చెప్పానని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని, తాను తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే… ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించిన వైనంపై జనసేన కూడా వేగంగానే స్పందించింది. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దామని, ఇకపై జనసేన కార్యకర్తలు గానీ, నేతలు గానీ ఈ విషయాన్ని ప్రస్తావించరాదని ఆ పార్టీ కోరింది.
అంతేకాకుండా నాగేశ్వర్ ను సీనియర్ మోస్ట్ అనలిస్ట్ గా పేర్కొన్న జనసేన… ఇకపై ఈ తరహా సమాచారం వస్తే.. దానిపై మాట్లాడే ముందు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని, తామే పూర్తి వివరాలను వెల్లడిస్తామని కూడా వెల్లడించింది. వెరసి నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, దానిని జనసేన స్వాగతించడంతో ఈ వ్యవహారం ఇక ముగిసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates