జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ హయాంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి భాషతో ఛీత్కారానికి గురయ్యారు. అయినా నాయకుల్లో మార్పు కనిపించడం లేదు. ఇటీవల కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ నోరుజారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా జనసేన ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడు, వుడా చైర్మన్ షేక్ రియాజ్ బూతులు మాట్లాడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జనసేన అప్రమత్తం అయ్యింది. బూతులు మాట్లాడే వాళ్లకు పార్టీలో స్థానం లేదని తేల్చి చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన చిగిలిశెట్టి ప్రసాద్ అనే ఎన్నారై అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. మెగా కుటుంబానికి వీరాభిమాని అయిన ప్రసాద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. జనసేన పార్టీలో కార్యకర్తలకు జరిగే అన్యాయం, నాయకుల తీరు మీద విమర్శలు గుప్పిస్తుంటాడు. అతడు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ని కూడా వదిలిపెట్టలేదు. ఎమ్మెల్సీ హరి ప్రసాద్ మీద కూడా వీడియో చేశాడు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య వివాదం రచ్చ కావడం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా మెలిగే ఒక న్యూస్ ఛానెల్ లో బాలినేని కి మద్దతుగా ఒక కథనం ప్రసారం అయ్యింది. అందులో జనసేనలోకి చేరిన రియాజ్ ఆస్తులు పోగొట్టుకున్నాడని, బాలినేని కంటే రియాజ్ నయమని ప్రస్థావించాడు. ఈ కథనం మీద చిగిలిశెట్టి ప్రసాద్ స్పందించాడు.

జనసేనలో చేరక ముందు రియాజ్ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అన్నది నీకు తెలుసా అని సదరు ఛానెల్ ను ప్రశ్నించాడు. జనసేనలో చేరి రియాజ్ పోగొట్టుకున్న ఆస్తులేమిటో చెప్పాలని ప్రశ్నించాడు. రియాజ్ ఆర్ధిక పరిస్థితి గురించి మాట్లాడాడు. దీంతో రియాజ్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ప్రసాద్ ను ఉద్దేశించి ఒరే లం.. కొడకా… నీకు దమ్ముంటే ఒంగోలుకు రారా అంటూ పచ్చిగా దూషించాడు.

చిల్లర నా కొ… క. ఎక్కడో అమెరికాలో తెల్ల వాళ్ళ బాత్ రూంలు కడుక్కునే నీకు మా కుటుంబం గురించి ఏమి తెలుసు అంటూ రెచ్చి పోయాడు. నీ వెనక ఒక నాయకుడు ఉన్నాడని తెల్సిందని, వాడి సంగతి, నీ సంగతి తెలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. రియాజ్ భాష మీద నెటిజన్లు మండి పడుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారం జనసేన ప్రతిష్టను దెబ్బతీసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ జనసేన మంగళగిరి కేంద్ర కార్యాలయం ఒక నోట్ విడుదల చేసింది. ఇందులో 9 అంశాల మీద సూచనలు చేశారు. జనసేన జన సైనికులు వాడే భాష, భావ వ్యక్తీకరణ విషయంలో పరిధి దాటవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లొద్దని సూచించారు. మొత్తం మీద బూతులు మాట్లాడితే పార్టీలో స్థానం లేదని డీసీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.