చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా ఉన్న సమయంలో హఠాత్తుగా మరణించడం అందరినీ కలచివేసింది. ఆయన లక్ష్యం నీరుగార్చకూడదనే ఉద్దేశంతో టీమ్ మిగిలిన భాగాన్ని పూర్తి చేసి నిర్మాత సహకారంతో థియేటర్ల దాకా తీసుకొచ్చింది. అయితే కొరియన్ కనకరాజు, డిసి, స్పైడర్ మ్యాన్ మేనియాలో ఉన్న జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఫలితంగా చేదు ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది.

నిజానికి అసలు కారణం కంటెంట్ బలహీనంగా ఉండటమే. దళపతిలో రజినీకాంత్, మమ్ముట్టి పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని ఇద్దరు యువకుల మధ్య ఫ్రెండ్ షిప్ శత్రుత్వానికి దారి తీస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద దర్శకులు కేకే గ్యాంగ్ స్టర్ డ్రామా రాసుకున్నారు. హీరోగా సెటిల్ కావడానికి కష్టపడుతున్న దీక్షిత్ శెట్టితో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల నటుడిగా ప్రూవ్ చేసుకుందామని ప్రయత్నం చేశాడు కానీ అదంతా వృథా అయిపోయింది.

కెజెక్యూ  ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పటి కేకె రూమ్ మేట్, ఆ సినిమాలో చిన్న క్యామియో చేసిన అనుబంధంతో ఎంతో కొంత పుష్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ వల్ల కెజెక్యూ ఆడియన్స్ దృష్టిలో పడలేదు. బాగుందా బాలేదా అనేది పక్కనపెడితే కనీసం రిలీజైన విషయం జనాలకు రిజిస్టర్ కావాలి. అది కూడా కెజెక్యూ విషయంలో జరగకపోవడం దురదృష్టం.

ఒక సూపర్ హిట్ తో నివాళి దక్కుతుందని ఎదురు చూసిన కెజెక్యూ టీమ్ సభ్యులు నిరాశ పడ్డారు. ఒకవేళ ఓటిటిలో వచ్చాక రెస్పాన్స్ మారుతుందేమో చూడాలి కానీ బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం డిజాస్టర్ గానే నిలిచిపోయింది. హీరోయిన్ యుక్తి తరేజా కన్నా ముందు ఈ కథకు అనుష్కని అనుకున్నారని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆ క్యారెక్టర్ కూడా ఏమంత గొప్పగా పేలలేదు. రెండో వారం వచ్చేలోపే సెలవు తీసుకున్న కెజెక్యూ మంచి నివాళి కాలేకపోయింది.