ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక, సోషల్ మీడియాలో నేతలంతా యాక్టివ్ గా ఉండాలని అన్ని పార్టీల అధినేతలు నిక్కచ్చిగా చెబుతున్నారంటే పబ్లిసిటీ, ప్రమోషన్, సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రజలపై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే, ముఖ్యంగా రాజకీయ నేతలు తమను తాము ప్రచారం చేసుకునేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఈ క్రమంలోనే తెలంగాణలోని రేషన్ కార్డులపై ప్రధాని మోదీ బొమ్మ వేయాల్సిందేనని, లేకుంటే ప్రజా ఉద్యమం చేసి తీరతానని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
రేపు తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. అయితే, ఆ కార్డులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫొటోలు మాత్రమే వేశారు. దీంతో, ఆ వ్యవహారంపై రఘునందన్ రావు స్పందించారు. రేషన్ కార్డు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కిలో బియ్యం మాత్రమే ఇస్తోందని, కానీ, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తోందని గుర్తు చేశారు. అటువంటిది మోదీ ఫొటో వేయకుండా కార్డులు ఎలా పంపిణీ చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు, మోదీ ఫొటో వేశాకే రేషన్ కార్డుల పంపిణీ చేయాల్సి, అప్పటి దాకా ఆ పంపిణీ కార్యక్రమం నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ, మోదీ ఫొటో లేకుండా కార్డుల పంపిణీ చేపడితే ప్రజా ఉద్యమం తప్పదని రేవంత్ సర్కార్ ను హెచ్చరించారు. అయితే, రఘునందన్ రావు ప్రజా సమస్యలపై పోరాడి ప్రజా ఉద్యమం చేస్తే బాగుంటుందని, ఇలా మోదీ ఫొటో అంశంపై ఉద్యమం చేయడం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates