సైకిల్ ఎక్కిన వైసీపీ భూమన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగానే కాకుండా… జగన్ కోసం ఏమైనా చేసేందుకు అనునిత్యం సిద్ధంగా ఉండే తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో యమా ట్రెండ్ అవుతోంది. జగన్ ను ఎంతగా అభిమానిస్తారో, టీడీపీని.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని, టీడీపీ నేతలను ఆయన అంతే స్థాయిలో వ్యతిరేకిస్తారు. అసలు టీడీపీ అంటేనే ఓ రేంజిలో ఫైరయ్యే భూమన… శెుక్రవారం టీడీపీ గుర్తు సైకిల్ పై రైడ్ చేస్తూ కనిపించారు.

ఇదేమంత పెద్ద విషయం కానప్పటికీ… పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన పొదుపు పాటించాలని దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మోదీ పిలుపునకు భూమన వెనువెంటనే స్పందించి ఉండాల్సింది.

అలా కాకుండా ఇంధన పొదుపునకు టీడీపీ, దాని మిత్రపక్షాలు పిలుపు ఇచ్చాక భూమన ఆ పిలుపును అనుసరిస్తూ సైకిల్ రైడ్ కు సిద్ధపడిపోవడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఏం చేసినా విమర్శించే భూమన ఇప్పుడు ఆ పార్టీ ఇచ్చిన ఇంధన పొదుపునకు అనుగుణంగా ఆ పార్టీ గుర్తు సైకిల్ పై సాగుతూ కనిపించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే… భూమన సైకిల్ రైడ్ ను జగన్ మీడియా సాక్షి టీవీలో ప్రముఖంగా ప్రసారం చేయడం మరింత ఆసక్తి రేకెత్తించింది. ఇక ఈ ఫీట్ లో తిరుపతి నగరంలో 10 కిలో మీటర్ల మేర సైకిల్ పై సాగిన భూమన… ఇంధన పొదుపు గురించి ప్రజలకు అవగాహన కల్పించారట. అదేంటో గానీ.. మోదీ పిలుపు మేరకు మహారాష్ట్ర సీఎం బైక్ ఎక్కారు. బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి అయితే ఏకంగా కాలి బాట పట్టారు. ప్రతి శుక్రవారం కాలి బాటనే సచివాలయానికి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారట.

ఇక ఏపీలో అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్కూటీ ఎక్కి తన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇక మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా శుక్రవారం సైకిల్ ఎక్కి ఇంధన పొదుపు గురించి జనాలకు అవగాహన కల్పించారు. ఇలా నేతలంతా తమకు వచ్చిన ఐడియాల మేరకు ఇంధన పొదుపు పాటిస్తుంటే.. జనం మాత్రం నేతల రాజకీయాలపై సెటైర్లు వేస్తూ సాగుతున్నారు. పొదుపు మాట ఓకే… ఇదే తరహాలో మీరెన్ని రోజులు ఇలా పొదుపు పాటిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.