ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరుతో రూపొందించిన ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఈ లేఖను సృష్టించారు.
ఈ లేఖలో.. “2024 ఎన్నికల్లో వర్మ గారు అందించిన సహకారం మరువలేనిది” అంటూ పేర్కొన్నారు. అలాగే పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నానని తెలిసిన వెంటనే బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ వర్మ తన సీటును త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారని, ఆయనకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని లేఖలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
భవిష్యత్తులో వర్మ చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరఫున బలంగా పనిచేస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తూ.. పిఠాపురం అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు కనిపిస్తోంది.
అయితే ఈ లేఖ పూర్తిగా నకిలీదేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. డీసీఎం కార్యాలయం నుంచి ఇలాంటి ఎలాంటి అధికారిక లేఖ విడుదల కాలేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఫేక్ లెటర్‌ను ఎవరు రూపొందించారు? ఏ ఉద్దేశంతో వైరల్ చేస్తున్నారు? అన్న దానిపై జనసేన నాయకత్వం ఆరా తీస్తోంది. మరోవైపు పిఠాపురం టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ లేఖ విస్తృతంగా షేర్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
