ప్రభుత్వంలో చీలికలు తప్పవా ?… మూణ్ణాల ముచ్చటేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం ఎంతోకాలం నిలిచేట్లు కనబడటం లేదు. ప్రభుత్వం ఏర్పాటయిన దగ్గర నుండి ఇటు జేడీయూ అటు బీజేపీల మధ్య ఏదో విషయంలో అసంతృప్తులు బయటపడుతునే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే మైనర్ పార్టనర్ అయిన జేడీయు అధినేత నితీష్ కుమార్ నే బీజేపీ ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడం.

బీహార్ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్టు పార్టీగా 76 సీట్లతో ఆర్జేడీ నిలవగా తర్వాత స్ధానం 73 సీట్లతో బీజేపీ నిలిచింది. మూడోస్ధానంలో 43 సీట్లతో జేడీయు నిలవగా కాంగ్రెస్ 19 చోట్ల గెలిచింది. ఎల్జేపీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఎంఐఎం 5 నియోజకవర్గాల్లో గెలవగా స్వతంత్రులు కూడా గెలిచారు. ఎప్పుడైతే బీజేపీకన్నా జేడీయుకి తక్కువ సీట్లు వచ్చాయో అప్పటి నుండి నితీష్ ను కమలం నేతలు చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. తక్కువ సీట్లొచ్చిన జేడీయుకే ముఖ్యమంత్రి పీఠం ఎందుకివ్వాలంటు బీజేపీ నేతలు అడ్డుపడినా అప్పట్లో ఏదో సర్దుబాటు చేసి నితీష్ ను కూర్చోబెట్టారు.

అసలే పరిస్ధితులు బావోలేవని అనుకుంటున్న సమయంలో అరుణాచల్ ప్రదేశ్ లో పరిస్ధితులు బీహార్ మిత్రపక్షాన్ని మరింత గందరగోళంలోకి నెట్టేసింది. బీహార్ లో మిత్రపక్షాలే అయినా అరుణాచల్ ప్రదేశ్ లోని ఏడుగురు జేడీయు ఎంఎల్ఏలను బీజేపీ తన పార్టీలోకి లాగేసుకుంది. అంటే జేడీయు తన మిత్రపక్షమని కూడా చూడకుండా బీజేపీ ఆపార్టీని చీల్చేసింది.

దాంతో అరుణాచల్ ప్రదేశ్ లో చీలిక ప్రభావం బీహార్ పైనా పడింది. అప్పటి నుండి జేడీయు నేతలంతా బీజేపీపై మండిపోతున్నారు. దానికి ఆర్జేడీ సీనియర్ నేతలు ఆజ్యం పోస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్డీయేలో నుండి నితీష్ బయటకు వచ్చేయాలని ఆహ్వానిస్తున్నారు.

ఎన్డీయేలో నుండి వచ్చేసి నితీష్ సీఎం పదవిని ఆర్జేడీకి ఇచ్చేస్తే యూపీఏ తరపున తదుపరి ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎన్నుకుంటామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బీజేపీతోనే కలిసుంటే బీహార్లో కూడా పార్టీని చీల్చేస్తారని చేస్తున్న హెచ్చరికలు నితీష్+జేడీయు నేతలపై ప్రభావం చూపుతాయనే అనుకుంటున్నారు. ఏదేమైనా బీజేపీ చేసిన తప్పు చివరకు ప్రభుత్వానికి ముప్పు తెచ్చేట్లుంది.