పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని అధికారులకు సూచించారు. ఎస్‌పీజీ ప్రోటోకాల్‌కు అనుగుణంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూనే ఈ మార్పులు చేపట్టారు.
హైదరాబాద్ పర్యటన అనంతరం గుజరాత్, అస్సాంలో పర్యటించిన సమయంలో కూడా ప్రధాని కాన్వాయ్‌లో తక్కువ వాహనాలనే వినియోగించారు. అలాగే కొత్తగా వాహనాల కొనుగోళ్లు తగ్గించి, సాధ్యమైన చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలను కాన్వాయ్‌లో చేర్చాలని సూచించినట్లు సమాచారం.
ప్రధాని మోదీ సూచించిన పొదుపు చర్యలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పర్యటనల సమయంలో కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలు కూడా అవసరానికి మించి వాహనాలు వినియోగించవద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జడ్ ప్లస్ భద్రత కలిగిన మంత్రి లోకేష్ కూడా తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన వాహనాలను సగానికి కుదిస్తూ, కేవలం రెండు వాహనాలతోనే ప్రయాణించాలని భద్రతా సిబ్బందికి స్పష్టం చేసినట్లు సమాచారం.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని పిలుపుని అనుసరిస్తూ తన కాన్వాయ్‌ను సగానికి కుదించుకున్నారు. జడ్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని భద్రతా అధికారులకు ఆదేశించారు. గురువారం ఉదయం నుంచే కాన్వాయ్‌లో మార్పులు అమలులోకి వచ్చినట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates