తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందన్న విషయంపై విజయ్ చాంతాడంత పొడవున్న మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
విజయ్ కోరుకున్నట్లే ఆయన పార్టీని తమిళ ఓటర్లు గెలిపించగా మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కటొక్కటిగా అమలులోకి తెస్తూ విజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం విజయ్ తీసుకున్న నిర్ణయం మందుబాబులకు షాకిచ్చిందని చెప్పాలి. విద్యాలయాలకు 500 మీటర్ల దూరం లోపల ఉన్న మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
విజయ్ సర్కారు మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం… పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్ లకు 500 మీటర్ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. తమిళనాడులో మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తమిళనాడు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద 4,765 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో 717 మద్యం దుకాణాలు పాఠశాలలు, కాలేజీలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, బస్టాండ్ లకు 500 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఈ మద్యం దుకాణాల వల్ల సామాన్య జనానికి ఇబ్బంది కలుగుతోందని ఆరోపణలున్నాయి.
ఎన్నికలకు ముందు టీవీకే విడుదల చేసిన మేనిఫెస్టోలో విద్యాలయాలు, ప్రార్థనా మందిరాలకు అతి చేరువలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయిస్తామని విజయ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే మంగళవారం ఉదయమే విజయ్ సర్కారు విద్యాలయాలు, ప్రార్థనా మందిరాలకు 500 మీటర్ల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ దుకాణాల మూసివేతకు ప్రభుత్వం రెండు వారాల గడువును విధించింది. విజయ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళనాడు వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సీనియర్ నటుడు కమల్ హాసన్ అయితే విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆకాశానికెత్తేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates