సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో పాటు విపక్ష అన్నాడీఎంకేలను చిత్తు చేసి అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ అయితే రాలేదు.

అయితే కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా అన్నాడీఎంకేకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తాము బేషరతుగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నట్లుగా ప్రకటించారు. ఒకే పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించిందంటే… ఇక ఐదేళ్ల పాటు విజయ్ సర్కారుకు ఎలాంటి ఢోకా లేదనే చెప్పవచ్చు.

వాస్తవానికి విజయ్ సీఎంగా పదవీ ప్రమాణం చేయకముందే… అన్నాడీఎంకేలో చీలిక సంకేతాలు కనిపించాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత షన్ముగం నేతృత్వంలో ఓ ఆరుగురు ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతుగా నిలిచేందుకు సిద్ధపడ్డారు.

ఈ కారణంగానే ఈ ఆరుగురు అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిసామి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాలేదు. విజయ్ కి మద్దతు పలికేందుకే ఈ ఆరుగురు సమావేశానికి రాలేదని ఆనాడే అంతా అనుకున్నారు. అయితే ఈ ఆరుగురు మద్దతు పలికేలోగానే విజయ్ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు.

అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు, మరో నాలుగు పార్టీలకు చెందిన ఇద్దరేసి సభ్యుల మద్దతుతో విజయ్ సర్కారు ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదముందన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఇప్పటికీ అదే తరహా అబిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అన్నాడీఎంకేకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు షన్ముగం నేతృత్వంలో విజయ్ కి మద్దతు పలికారు. అన్నాడీఎంకే శాసనసభాపక్షం మొత్తంగా విజయ్ కి మద్దతు తెలుపుతోందని ఈ సందర్భంగా షన్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయ్ కి మద్దతుగా షన్ముగం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజలు విజయ్ ని సీఎంగా చేయాలని కోరుకున్నారని ఆయన అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ తాము విజయ్ కి మద్దతుగా నిలిచేందుకు సిద్ధపడ్డామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా పళనిసామి నేతృత్వంలో అన్నాడీఎంకే వరుసగా రెండు పరాజయాలను చవిచూసిందని ఆయన అన్నారు.

పార్టీని ప్రజలు వరుసగా రెండు సార్లు ఓడించారంటే… ఇక ఆ పార్టీ నాయకత్వం ప్రజలకు అవసరం లేదన్న భావనే వ్యక్తమవుతోందని, ఈ కారణంగానే తాము విజయ్ పార్టీకి మద్దతుగా నిలవాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు.

మొన్నటి ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 సీట్లను మాత్రమే గెలిచింది. గెలిచిన 47 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతుగా నిలిచారంటే… అన్నాడీఎంకే శాసనసభాపక్షం విజయ్ పార్టీలో విలీనం అయినట్టే లెక్క. అంటే అన్నాడీఎంకేను 30 మంది ఎమ్మెల్యేలు వీడారంటే… మెజారిటీ ఎమ్మెల్యేలు ఎటు వెళితే… వారితోనే పార్టీ వెళ్లిపోయినట్లు లెక్క కదా.

ఈ లెక్కన అన్నాడీఎంకేకు 17 మంది ఎమ్మెల్యేలు మిగిలినా..మెజారిటీ ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో అన్నాడీఎంకే విజయ్ పార్టీ అయిన టీవీకేలో విలీనం అయినట్టే లెక్క. ఇదే జరిగితే… పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అన్న మాటే ఉద్భవించదు. విజయ్ సర్కారు సంపూర్ణ మెజారిటీతో ఐదేళ్ల పాటు ఏ ఢోకా లేకుండా పాలనను సాగిస్తుంది.