తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ(తమిళ వెట్రిగ కళగం) అధినేత సీ. జోసెఫ్ విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్‌తోపాటు.. సీనియర్ నాయకులు కూడా కొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు.
అయితే.. తొలిరోజే విజయ్.. మూడు కీలక హామీలపై సంతకాలు చేసి అదరహో అనిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించే ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటుపై రెండో సంతకం చేశారు. తద్వారా రాష్ట్రంలో మహిళల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్న సంకేతాన్ని ఆయన తొలిరోజే పంపించారు.
ఇక, దేశాన్ని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తలనొప్పిగా మారిన డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు.. ఉద్దేశించిన వ్యవస్థను ఏర్పాటు చేసే ఫైలుపై మూడో సంతకం చేశారు. తద్వారా ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఉన్న ఈగల్ వంటివ్యవస్థను విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మూడు హామీలను కూడా.. విజయ్ ఎన్నికలకు ముందే ప్రకటించారు. తాజాగా వీటిని అమలుచేస్తూ.. విజయ్ సంతకాలు చేయడం గమనార్హం.
కాగా, విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కూడా వచ్చారు. వీరితో విజయ్ స్వయంగా సెల్ఫీలు తీసుకున్నారు. వీడియో చిత్రించారు. ఇక, ప్రమాణ స్వీకారం అనంతరం.. గవర్నర్ అర్లేకర్.. విజయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పుష్పగుచ్ఛాలు అందించి.. మంచి పాలన అందించాలని సూచించారు. ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ కూడా.. ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates