వైకాపా మంత్రి కొడాలి నాని మామూలుగానే ప్రత్యర్థులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతుంటారు. ఆయన్ని ఎవరైనా చిన్న మాట అంటే.. దానికి ఇంతెత్తు లేస్తారు. మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా నారా చంద్రబాబు నాయుడిని వాడు వీడు అని బూతులు తిట్టేస్తుంటారాయన. అలాంటి వ్యక్తిని నిన్న గుడివాడ రోడ్ షో సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు.
మరో మంత్రి పేర్ని నానిని కూడా ఉద్దేశించి విమర్శలు చేశారు. ముఖ్యంగా ‘శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం.. ఎంతో మంది నానీల్లో ఒక నాని’ అంటూ పవన్ చేసిన కామెంట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విమర్శలపై కొడాలి నాని ఏమని బదులిస్తాడా అని అంతా ఎదురు చూశారు. అనుకున్నట్లే కొడాలి నాని లైన్లోకి వచ్చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మంగళవారం పేదలకు ఇల్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నాని.. పవన్ విమర్శలపై స్పందించారు.
పవన్ చేసిన ‘బోడి లింగం’ కామెంట్లపై నాని మీడియాతో మాట్లాడుతూ.. పవనే పెద్ద బోడి లింగమంటూ విరుచుకుపడ్డారు. తామంతా శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారని.. పవన్ పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు. ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్లను ప్రజలు నమ్మరంటూ పవన్‌కు కౌంటర్ వేశారు నాని.
ప్రజల తిరస్కారానికి గురైన పవన్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. పవన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టమన్నారు. గజదొంగ లాంటి చంద్రబాబు, బోడి లింగం లాంటి పవన్ కల్యాణ్‌లు ఎంతమంది వచ్చినా, దేవుడు ఆశీస్సులు ఉన్నంత కాలం జగన్ బొచ్చు కూడా పీకలేరంటూ కొడాలి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.