పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి తనను జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రమే రక్షించగలరని నమ్మింది. తనను రక్షించాలంటూ పవన్ కల్యాణ్ ను వేడుకుంటూ పవన్ కల్యాణ్ కు ఓ వీడియో సందేశం పంపింది. ఈ వీడియోను చూసిన వెంటనే స్పందించిన పవన్… ఆ మహిళను ప్రమాదం నుంచి క్షేమంగా బయటకు తీసుకువచ్చి… ఆమెను ఆమె సొంతింటికి చేర్చారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఏపీలోని అన్నమయ్య జిల్లా వేంపాడుకు చెందిన ముస్లిం మహిళ షానవాజ్ బతుకుదెరువు నిమత్తం ఓమన్ దేశానికి వెళ్లింది. అక్కడ ఓ అరబ్ షేక్ ఇంటిలో పనిమనిషిగా చేరింది. కొంతకాలం బాగానే ఉన్నా… ఆ తర్వాత సదరు అరబ్ షేక్ ఆ మహిళపై తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. రోజు షానవాజ్ ను శారీరకంగా హింసించి మరీ పని చేయించుకునే వాడు. ఈ వేధింపులను తాళలేక ఎలాగైనా ఈ కూపం నుంచి బయటపడే దిశగా షానవాజ్ అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఆశ్రయించింది.

అందులో భాగంగా తనను కాపాడాలంటూ పవన్ కల్యాణ్ ను వేడుకుంటూ ఓ సెల్ఫీని రిలీజ్ చేసింది. తాను పనిచేస్తున్న అరబ్ షేక్ కంటబడకుండా బాత్ రూంలోకి వెళ్లి మరీ ఈ వీడియోను ఆమె తీసింది. తనను రోజూ కొడుతున్నారని, ఆ వేధింపులు తాళలేకపోతున్నానని, తనను ఆ కూపం నుంచి బయటపడవేయాలని ఆమె పవన్ ను కోరింది. ఆ తర్వాత సదరు వీడియోను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా…ఆ వీడియోను పవన్ చూసిన వెంటనే స్పందించారు.

వీడియోను చూసిన వెంటనే వేగంగా స్పందించిన పవన్… భారత విదేశాంగ శాఖను అప్రమత్తం చేశారు. దీంతో మహిళ లొకేషన్ ను ట్రేస్ చేసిన విదేశాంగ శాఖ అధికారులు అరబ్ షేక్ ఉచ్చు నుంచి షానవాజ్ ను కాపాడారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించి పవన్ సూచన మేరకు ఆమెను భారత్ పంపారు.

ఈ క్రమంలో ఒమన్ నుంచి గురువారం రాత్రి హైదరాబాద్ చేరిన షానవాజ్… నేరుగా పవన్ ను కలిసింది. అరబ్ షేక్ నుంచి తన ప్రాణాలను కాపాడిన పవన్ కల్యాణ్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఏ తెలుగు వ్యక్తి కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా పవన్ చెప్పారు.