ప‌వ‌న్‌కు బాబు ప‌రామ‌ర్శ‌.. పిఠాపురంపై చ‌ర్చ‌?!

జ‌న‌సేన అధినేత‌,ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సీఎం చంద్ర‌బాబు పరామ‌ర్శించారు. కొన్నాళ్ల కింద‌ట ముక్కుకు ఆప‌రేషన్ అయిన నేప‌థ్యంలో ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న నివాసంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా శ‌నివారం హైద‌రాబాద్ వెళ్లిన సీఎం చంద్ర‌బాబు ఆయ‌న నివాసానికి వెళ్లి.. ఆరోగ్యంపై వివ‌రాలు తెలుసుకున్నారు. గ‌త వారం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న శాఖ‌ల‌పై స‌మీక్ష చేస్తున్న క్ర‌మంలో ఆరోగ్య స‌మ‌స్య ఎదురైంది. దీంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అప్ప‌ట్లోనే ఆయ‌న‌కు శ‌స్త్ర చికిత్స చేశారు.

ప‌రామ‌ర్శ అనంత‌రం.. ప‌వ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాల‌పైనా ఇరువురు మాట్లాడినట్టు తెలిసింది. ఇటీవ‌ల ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ-జ‌న‌సేన సీనియ‌ర్ నాయ‌కులు ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగారు.

ప్రొటోకాల్ ప్ర‌కారం.. ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుని వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చంద్ర‌బాబు చ‌ర్చించి.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టారు.

ఈ క్ర‌మంలో తాజాగా ప‌వ‌న్‌తో ఈ విష‌యం చ‌ర్చించిన చంద్ర‌బాబు.. పిఠాపురంలో ఎలాంటి రాజ‌కీయాల‌కు తావు లేద‌ని, అభివృద్ధి విష‌యంలో ఎలాంటి అడ్డంకులు రాబోవ‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. పిఠాపురంలో గ‌తానికి భిన్నంగా రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, చేప‌ట్టిన ప్రాజెక్టులు.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల సీఎం సంతోషం వ్య‌క్తం చేశారు.

త‌న‌వంతుగా.. నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలకు అవ‌కాశం లేకుండా చూస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం కావాల్సింది అభివృద్ధేన‌ని.. ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా క‌ల‌సి ఉండ‌డ‌మే ముఖ్య‌మని ఇరువురు నాయ‌కులు ఒక అభిప్రాయానికి వ‌చ్చారు.