జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కదా.. ఇక్కడ కూడా డీఎస్సీ వ్యవహారంలో రాష్ట్ర మంత్రి కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాదాపు పాతిక రోజులపాటు విద్యార్థులు లాఠీ దెబ్బలు తిని రోడ్లపై ఆందోళనకు దిగినా పట్టించుకోని జగన్ ఇప్పుడు ఆ అంశంపై మాట్లాడటం, దానిని ఏపీకి ముడి పెట్టడం ఆశ్చర్యంగానే ఉంది.

‘నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’ అంటూ ట్విట్టర్‌లో జగన్ పొగిడారు. ఇన్ని రోజులు కనీసం నోరు మెదపని జగన్, సమస్య పరిష్కారం అయ్యాక ఎన్డీఏను వెనకేసుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్ష నిర్వహణలో అంతులేని అక్రమాలు జరిగాయని జగన్ కొద్ది రోజుల నుంచి గగ్గోలు పెడుతున్నారు. దీనిపై రెండు మూడు ప్రెస్ మీట్స్ కూడానిర్వహించారు. వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కూడా ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వం దీటుగా సమాధానం ఇవ్వడంతో కొంతకాలంగా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు కొత్తగా కోర్టు మెట్లు కూడా ఎక్కుతున్నారు.

‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం’ అని జగన్ ట్వీట్ చేశారు. దాదాపు 3.5 లక్షల మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం చంద్రబాబు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా? అని జగన్ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్న వైసీపీ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ వివాదంపై ఎందుకు అదే తీవ్రతతో స్పందించలేకపోతోందన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.