కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన ముద్రగడ… మెజారిటీ కాలం కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ల సాధన కొరకే కేటాయించారు. కాపుల కోటా కోసం ముద్రగడ చేపట్టిన వినూత్న నిరసనలు ఈ తరానికి తెలియవేమో గానీ… తెలుగు నేల రాజకీయాలపై ఓ మోస్తరు అవగాహన ఉన్న వారెవరికైనా ఇట్టే గుర్తుకు రాక మానవు. కులం కోసం రాజకీయాలనే పక్కనపెట్టి మరీ పోరాటం సాగించిన ముద్రగడ ప్రస్థానాన్ని భావి తరాలకు గుర్తుండేలా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముద్రగడ విగ్రహం ఒకటి త్వరలోనే విజయవాడ వీధుల్లో ఏర్పాటు కానుంది.
ముద్రగడ మరణం నేపథ్యంలో ఆయన సంస్మరణార్థం శనివారం విజయవాడలో కాపులు ఏర్పాటు చేసిన సమావేశానికి రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇలా ముద్రగడకు నివాళి అర్పించేందుకు వచ్చిన వారిలో టీడీపీ కీలక నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉంటూ నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ సాగుతున్న ఈ ఇద్దరు నేతలు ముద్రగడ సంస్మరణ సమావేశం కోసం ఒకే వేదిక మీదకు చేరడం గమనార్హం.
ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన బొండా ఉమా విజయవాడలో త్వరలోనే ముద్రగడ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. నగరంలో ఏ ప్రదేశంలో ముద్రగడ విగ్రహం ఏర్పాటు చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నామని, త్వరలోనే దీనిపై అధికారికంగా ఓ ప్రకటన చేస్తామని కూడా ఆయన తెలిపారు. కాపులను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ముద్రగడ తీవ్రంగా శ్రమించారని, చివరకు కాపులంతా ఐక్యతగా సాగేలా ఆయన చేయగలిగారని కూడా ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి అదికారం దక్కాలన్నా… కాపుల ఓట్లే కీలకంగా మారిన పరిస్థితులకు ముద్రగడ కూడా ఓ కారణమని ఆయన పేర్కొన్నారు.
కాపుల్లో మెజారిటీ ఓట్లు ఏ పార్టికి పడితే ఆ పార్టీకే అధికార పీఠం దక్కుతోందని బొండా ఉమా చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో ఈ తరహా పరిస్థితి విస్పష్టంగా కనిపించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర జనాభా 5కోట్లు ఉంటే… అందులో ఏకంగా కోటికి పైగా ఉన్న కాపుల ఓట్లు అధికార పార్టీని నిర్ణయించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. 2019 ఎన్నికల్లో కాపుల ఓట్లు పడకపోవడంతోనే టీడీపీ ఓటమిపాలైందని ఆయన చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అంబటి… మాట కోసం పేరు మార్చుకున్న ఒకే ఒక్క నేతగా ముద్రగడ నిలిచారని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

