అఖిల్ భారతీయుడు కాదా?

భారతీయులకు విదేశీ పౌరసత్వాలు దక్కడం కొత్తేమీ కాదు. ముందు ఇండియాలోనే పుట్టి పెరిగి.. తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాక ఆ దేశాల పౌరసత్వాలు సంపాదిస్తుంటారు. కొందరు సెలబ్రెటీలకు గౌరవార్థం, కొన్ని అవసరాల రీత్యా విదేశాలు తమ పౌరసత్వాన్ని ఇస్తుంటాయి. ఐతే చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉన్న టాలీవుడ్ యువ కథానాయకుడు ఇప్పటిదాకా ఇండియన్ సిటిజన్‌ కాదు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ విషయాన్ని ఒక పాడ్ కాస్ట్‌లో స్వయంగా అఖిల్ వెల్లడించాడు.

అయ్యగారు పుట్టింది అమెరికాలో అన్న సంగతి తెలిసిందే. అక్కడే కొంత కాలం ఉండి తర్వాత హైదరాబాద్‌కు వచ్చేశాడు. అమెరికాలో పుట్టడం వల్ల అతడికి ఆ దేశ పౌరసత్వం లభించింది. ఐతే ఇప్పటికీ అఖిల్ అమెరికన్ సిటిజన్‌గానే కొనసాగుతున్నాడట. తనకు భారతీయ పౌరసత్వం లేదట. అలా అని తాను భారతీయుడు కాకుండా పోనని.. తాను వంద శాతం ఇండియన్ అని, మన దేశ పౌరుడిగా మారే ప్రక్రియ జరుగుతోందని చెప్పాడు. కొన్ని నెలల్లో అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకోబోతున్నానని.. ఇండియన్‌గా మారతానని అఖిల్ స్పష్టం చేశాడు.

ఇక తన అన్నయ్య నాగచైతన్యతో తన సంబంధాల గురించి అఖిల్ ఈ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీళ్లిద్దరికీ నాగార్జునే తండ్రి అయినా.. తల్లులు వేరన్న సంగతి తెలిసిందే. నాగ్ తొలి భార్య లక్ష్మికి చైతూ పుట్టగా.. రెండో భార్య అమలకు అఖిల్ జన్మించాడు. ఐతే తమ మధ్య ఎలాంటి పొరపొచ్ఛాలు లేకుండా, కలిసి మెలిసి పెరగాలన్నది తండ్రి అభిమతమని.. అందుకే ఈ విషయంలో ఇద్దరికి చిన్నప్పటినుంచే స్పష్టత ఇస్తూ పెంచారని అఖిల్ చెప్పాడు. బయటి వాళ్ల మాటలు తమ మీద ఎలాంటి ప్రభావం చూపించకుండా ఇంట్లో మంచి వాతావరణం ఉండేలా తండ్రి చూసుకున్నట్లు అతను వెల్లడించాడు.

చైతూ చెన్నైలో పెరిగాడని.. అక్కడ తన ఇంటికి వెళ్లి కొన్ని రోజులు ఉన్నానని.. తర్వాత తనకు 10-11 ఏళ్ల వయసున్నపుడు హైదరాబాద్‌కు వచ్చేశాడని అఖిల్ గుర్తు చేసుకున్నాడు. ఐతే ఒకేసారి తామిద్దరం క్లోజ్ అయిపోలేదని.. వయసు అంతరం, వేర్వేరు చోట్ల పెరగడం వల్ల మొదట్లో కొంచెం గ్యాప్ ఉందని.. తర్వాత నెమ్మదిగా దగ్గరయ్యామని, ఈ విషయంలో పెద్దవాడిగా అన్ని విషయాలూ అర్థం చేసుకుని చైతూ పరిణతితో వ్యవహరించాడని.. ఇప్పుడు తమ మధ్య అందమైన అనుబంధం ఉందని అఖిల్ తెలిపాడు.