సభలో అవమానం.. మండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య

విషాద ఉదంతం చోటు చేసుకుంది. ఏ మాత్రం ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కర్ణాటక రాజకీయ వర్గాల్నే కాదు.. దేశ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. చిక్ మంగ్ ళూరు వద్ద ఆయన డెడ్ బాడీని గుర్తించారు.

రైలు పట్టాలపై ఆయన మృతదేహం వద్దే.. సూసైడ్ నోట్ లభించింది. సోమవారం సాయంత్రం ఆయన ఒంటరిగా కారులో బయలుదేరినట్లుగా చెబుతున్నారు. ఈ నెల 15న కర్ణాటక శాసన మండలిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. పలువురు కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ధర్మేగౌడను కుర్చీలో నుంచి లాగేయటం తెలిసిందే.

ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతంతో తీవ్ర మనస్తాపానికి గురైన డిప్యూటీ ఛైర్మన్.. ఆత్మహత్య చేసుకోవటానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఉదంతంతోనే సూసైడ్ చేసుకున్నారా? మరేదైనా కారణం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. ధర్మేగౌడ ఆత్మహత్యపై మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు. కర్ణాటక రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారిన ఈ ఉదంతాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సూసైడ్ కు చోటు చేసుకున్న అంశాలపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.