‘రాజ‌కీయ… సినిమా’ కిచిడీ.. వ‌ర్క‌వుట్ అయ్యేనా?

మేం ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా రాజ‌కీయాలు చేస్తాం. ప్ర‌బుత్వాన్ని నిల‌దీస్తాం. నాయ‌కుల తాట తీస్తాం. – ఇదీ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైఖ‌రి. ఇదేదో ఎప్పుడో .. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు చేసిన ప్ర‌సంగం కాదు. ఎన్నిక‌ల్లో ఓట‌మి ఆవేద‌న‌, ఆక్రోశంతో కొన్నాళ్ల కింద‌ట చేసిన కామెంట్లు కూడా కావు. తాజాగా కృష్ణాజిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ .. చేసిన హాట్ కామెంట్లు. ఒక‌వైపు ప్ర‌జాస్వామ్య రాజ‌కీయాలు చేస్తున్నామ‌ని చెబుతున్న ప‌వ‌న్‌.. మ‌రో వైపు.. తాట తీస్తాం.. తోలు తీస్తాం.. అంటూ వ్యాఖ్యానించ‌డం ప‌వ‌న్ కు క‌లిసి రావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న ఇలానే దూకుడు ప్ర‌ద‌ర్శించారు. త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఎవ‌రైనా ఏమంటే.. తాట‌తీస్తాం అని హెచ్చ‌రించారు. అదేస‌మ‌యంలో పార్టీల అధినేత‌ల‌ను కూడా ఆయ‌న ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. అయితే.. ఇవేవీ.. ప‌వ‌న్‌కు ప్ల‌స్‌లు కాలేదు. పైగా మైన‌స్‌లు అయ్యాయి. సినిమా రంగం నుంచి అనేక మంది రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కానీ, సినిమా డైలాగు ల‌కు, రాజ‌కీయ పంచుల‌కు తేడా గ్ర‌హించారు. ఆ విధంగానే మ‌సులుకున్నారు. ఎక్క‌డా సినిమాల‌ను-రాజ‌కీయాల‌ను క‌లిపేసి కిచిడీ మాదిరిగా వ్య‌వ‌హ‌రించ‌లేదు. ఎక్క‌డ ఏమేర‌కు సినీ గ్లామ‌ర్ వ‌ర్కువుట్ అవుతుందో అంత వ‌ర‌కు వినియోగించు కున్నారు త‌ప్ప‌.. ప్ర‌తిదానికీ.. సినిమా డైలాగులు వ‌ల్లించ‌లేదు.

అయితే.. ఈ త‌ర‌హా ప‌రివ‌ర్త‌న‌, ముందు చూపు ప‌వ‌న్‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. తాజాగా గుడివాడ‌లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల ముందున్న రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్నే సృష్టించారు. త‌న పంచ్ డైలాగులు, వ్యంగ్యాస్త్రాలు, సినీ కామెంట్ల‌తో యువ‌త‌నైతే.. రెచ్చ‌గొట్టారు.. కానీ, రాజ‌కీయంగా మాత్రం ఆయ‌న సాధించింది లేదు. ‘‘ఏదైనా ప్రశ్నిస్తే.. ఒక్కొక్కరూ బూతులు తిడుతుంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి? నానీయా? వైసీపీలో నానీలు ఎక్కువమంది. ఏదో ఒక నాని. ఏ నానో నాకు అర్థం కావడం లేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం. అనేక మంది నానిలలో ఒక నాని. ఎవరైతే మనకేంటి? శతకోటి నానిలలో ఒకరైన నానికి చెబుతున్నా. మీ సీఎం సాబ్‌కు చెప్పండి. జగన్ రెడ్డి గారికి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం’’ అని అన్నారు.

అయితే.. నిజానికి ప‌వ‌న్ చేసింది సీరియ‌స్ ప్ర‌తిపాద‌న‌. కానీ, ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలితో ఆయన హావ‌భావాల‌తో ఈ సీరియ‌స్‌నెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. దీంతో ఈ డైలాగులకు చ‌ప్ప‌ట్ల‌తోపాటు న‌వ్వుల జ‌ల్లులు కూడా కురిశాయి. మంత్రి కొడాలి నాని వంటి ఓ బ‌ల‌మైన నాయ‌కుడిని టార్గెట్ చేయాల‌నుకున్న‌ప్పుడు.. ఇంత సిల్లీ గా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌నేది ప‌లువురి మాట‌. కానీ, ప‌వ‌న్ మాత్రం త‌న ధోర‌ణిని మార్చుకోవ‌డం లేదు. ఇప్పుడు ప‌వ‌న్ కామెంట్లు, డైలాగుల‌ను సోష‌ల్ మీడియాలో ఎంజాయ్ చేస్తున్న‌వారు కూడా.. వీటిని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. మ‌రి ప‌వ‌న్ వ్యూహ‌మేంటో.. ఏం చేస్తారో.. చూడాలి!!