తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. వీ హనుమంతరావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. అంతేకాదు.. ఆయనకు మంత్రి హోదాను కూడా కట్టబెట్టారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రికి ఉండే హోదాను ఆయనకు కట్టబెడుతూ.. తాజాగా సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఆయన మంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో నెలకు 3 లక్షల రూపాయల వేతనం.. కారు, భద్రతా సిబ్బంది, పీఏ వంటివారిని సమకూర్చుతారు.
హ్యాపీసేనా?
అయితే.. ఈ పదవితో హనుమంతన్న హ్యాపీ అవుతారా? అసలు తీసుకుంటారా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. తన సీనియారిటీని గమనించి.. తనకు చిట్టచివరి అవకాశం ఇవ్వాలని గత కొన్నాళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభకు వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. కానీ, ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల సీనియర్లను గౌరవించాలంటూ.. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో .. హనుమంతన్నకు ఈ పదవిని అప్పగించారు.
కానీ, ఆది నుంచి కూడా హనుమంతరావు.. తాను ఇచ్చే సలహాలను ఎవరూ పాటించడం లేదని వాదిస్తున్నారు. నామాటెవరింటరు బిడ్డా! అంటూ.. తనదైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే సలహాదారు పదవిని ఆయనకు కట్టబెట్టారు. దీంతో ఆయన ఇచ్చే సలహాలను ప్రభుత్వం పాటిస్తుందా? అనేది ప్రశ్న. ఇదే సందేహం ఆయనలోనూ ఉంది. దీంతో ప్రస్తుతం ఆయనకు కీలక పదవిని కట్టబెట్టినా.. ఆయన ఏమేరకు సంతృప్తి చెందుతారన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates