ఏపీలో జగన్ పాలనకు ఏడాది పూర్తయింది. నిజానికి కొత్త ప్రభుత్వానికి ఏడాది కాలం అంటే.. సాధించిన విషయాలకు గీటు రాయి వంటిదనే చెప్పాలి. అయితే, దురదృష్టం ఏంటంటే.. ఈ ఏడాది కాలంలోనూ జగన్ ప్రభుత్వానికి కరోనా వైరస్ అశనిపాతంగా పరిణమించింది. దీంతో ఇటీవల రెండు నెలల కాలం హరించుకుపోయింది. దీంతో జగన్ పాలన ఏడాది ముగిసినప్పటికీ.. పది మాసాలనే ప్రామాణికంగా భావించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో జగన్ పరిపాలనను గమనిస్తే.. కీలకమైన అనేక విషయాలు వెలుగు చూస్తాయి. వీటిలో మరింత కీలకమైంది.. మహిళలకు ప్రాధాన్యం. నిజానికి చాలా ప్రభుత్వాలు తాము మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడం అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పేవారు.
అయితే, ప్రాధాన్యం అంటే ఏంటి? అనే విషయంలో జగన్ చరిత్ర సృష్టించారని అంటున్నారు పరిశీలకులు. అదెలాగంటే.. ప్రాధాన్యం అంటే.. ఏదో మహిళలకు కొన్ని పదవులు ఇవ్వడమో.. లేక వారికి టికెట్లు ఇవ్వడమో వరకే పరిమితం కాలేదు. వారి ఆలోచనా శక్తిని కూడా జగన్ గుర్తించారు. జగన్ కేబినెట్‌లో ఒకరు డిప్యూటీ సీఎంగా.. ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. అదే సమయంలో నామినేటెడ్ పదవుల్లో ఒకరు ఉన్నారు.
వీరందరికీ పదవులు ఇవ్వడం అంటే ఇచ్చాం అన్నట్టుగా జగన్ ఏనాడూ వ్యవహరించలేదని అంటారు ఈ మహిళా నాయకులు. పదవులు ఇవ్వడమే కాకుండా వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించారని చెబుతారు. అంతేకాదు, వారు ఏదైనా విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చినా జగన్ స్వీకరిస్తారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో హోం శాఖ మంత్రి సుచరిత, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రి వనిత దిశపోలీస్ స్టేషన్ల ఆలోచన చేశారు. నిజానికి ఇది ఆదిలో ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన కాదు. ఏ సలహాదారుడు కూడా దీనిని ప్రస్థావించలేదు. కానీ మంత్రులు ఈ విషయాన్ని ఆలోచించి జగన్ ముందు పెట్టారు. దీంతో ఆయన క్షణం కూడా ఆలోచించకుండా.. దిశ యాప్ సహా పోలీస్ స్టేషన్ల ఏర్పాడుకు మార్గదర్శకాలు తయారు చేయాలని హోం శాఖను ఆదేశించారు.
అదే సమయంలో మహిళలకు పౌష్టికాహారం పెంపు సహా మధ్యాహ్న భోజనంలో పౌష్ఠికాహారం కింద చిక్కీలను ఇవ్వాలన్ని మంత్రి వనిత ఆలోచనలను కూడా జగన్ ఖర్చు అని కూడా చూడకుండా అమల్లోకి తెచ్చారు.
ఇక, గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యం కల్పించేందుకు ఉన్న అవకాశాలపై మంత్రి శ్రీవాణి వివరించడంతో వాటి అమలుకు కూడా వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించేలా జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఇక, మరో కీలక విషయం ఏంటంటే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా ఐఏఎస్ నీలం సాహ్నిని నియమించడంతోపాటు ఆమెకు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జగన్‌కే చెల్లిందని అంటున్నారు పరిశీలకులు. మరో కీలక విషయం నామినేటెడ్ పదవులు రాష్ట్రంలో ఎక్కడ ఏ శాఖలో ఉన్నప్పటికీ.. వాటిలో 50 శాతం మహిళలకే కేటాయించారు.
ఇక, స్థానిక ఎన్నికల్లోనూ మహిళలకు 50 శాతం అవకాశం కల్పించారు. ఇవన్నీ ఒక ఎత్తు.. ఆర్ధికంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయమైనా.. కూడా మహిళలకు దక్కేలా నిర్ణయం తీసుకోవడం జగన్ మహిళా పక్షపాతి అనేందుకు మరో కారణంగా నిలిచింది. అమ్మ ఒడి సహా కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటును నేరుగా తల్లుత ఖాతాల్లోకే జమ చేయడం ఏపీ చరిత్రలోనే తొలిసారి అని అధికారులే చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates