అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత కాల మానం ప్రకారం.. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో (అమెరికా కాల మానం ప్రకారం.. రాత్రి సుమారు 11 గంటల సమయం) ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ కాల్పుల ఘటన నుంచి అధ్యక్షుడు సహా అందరూ తృటిలో తప్పించుకున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో వివరించారు.
ఏం జరిగింది?
ప్రస్తుతం ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పలు అంశాలపై చర్చించేందుకు వైట్ హౌస్‌లోని డిన్నర్ హాల్‌లో ప్రతినిధుల(కరస్పాండెంట్స్) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరికీ భోజనాలు వడ్డించారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్ కూడా హాజరయ్యారు. అయితే.. హఠాత్తుగా ఓ వ్యక్తి ట్రంప్, జేడీ వాన్స్‌లే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఒక్కసారి అందరూ ప్రాణ భయంతో తమ ముందున్న టేబుళ్ల కింద దాక్కున్నారు.
ట్రంప్, అదేవిధంగా జేడీవాన్స్‌లకు సీఐఏ ఏజెంట్స్.. రక్షణ వలయంగా ఉన్నారు. వెంటనే అప్రమత్త మైన.. సీఐఏ ఏజెంట్లు.. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. అయితే.. కొన్నాళ్లుగా అమెరికాలో ట్రంప్ పాలనపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
ట్రంప్ ఏమన్నారంటే..
“డిన్నర్ కాన్ఫరెన్సులో ఓ దుండగుడు జరిపిన కాల్పులు కలకలం రేపాయి. అయితే.. సీక్రెట్ సర్వీస్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వారు అద్భుతంగా పనిచేశారు. వారు వేగంగా, ధైర్యంగా వ్యవహరించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు. అయితే.. భద్రతపై సమీక్ష నిర్వహిస్తాం. ఇది ఎలా జరిగిందనే విషయంపై సీక్రెట్ సర్వీస్ అధికారులు సమీక్ష చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.“ అని ట్రంప్.. తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates