తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో నినాదాల హోరు మారుమోగిపోయింది. ఈ నినాదాల ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రష్తుతం సరికొత్త నినాదాలు వినవస్తున్నాయి.
అందులో భాగంగా గురువారం తెలంగాణలోని హుజూరాబాద్ వేదికగా వినిపించిన ఓ కొత్త నినాదం… తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వద్దురా… ఉమ్మడి ఆంధ్ర ముద్దురా అంటూ వినిపించిన ఈ నినాదం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
గడచిన రెండు రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 42 అంశాల్లో కొత్త డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలు… వాటిని సాధించుకునేందుకు సమ్మె బాట పట్టాయి. కార్మికుల సమ్మెను విరమింపజేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కారు చివరి దాకా యత్నించింది.
కార్మికులు ప్రస్తావిస్తున్న 41 అంశాల్లో 39 అంశాలకు చెందిన డిమాండ్లను అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆయా సమస్యలను పరిష్కరించకుండా సాగుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు.
ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఎక్కడికక్కడ కార్మికులు విధులను బహిష్కరించి… నిరసనలకు దిగారు. ఆయా ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల నిరసనల హోరు గట్టిగానే వినిపిస్తోంది. ప్రభుత్వ తీరును ఎండగడుతూ సాగుతున్న ఈ నిరసనల్లో పెద్ద పెట్టున నినాదాల హోరు కూడా వినిపిస్తోంది.
అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డిపో ముందు నిరసనకు దిగిన ఆర్టీసీ కార్మికులు సరికొత్త నినాదాన్ని వినిపించారు. తెలంగాణ వద్దురా… ఉమ్మడి ఆంధ్ర ముద్దురా అంటూ సాగిన ఈ నినాదంతో ఆర్టీసీ మహిళా కార్మికులు హోరెత్తించారు. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆర్డీసీ పరిస్థితి బాగుందని… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాతే తెలంగాణ ఆర్టీసీ తిరోగమన దిశలో వెళుతోందని వారు ఆరోపించారు. మొత్తంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ 12 ఏళ్లకే తెలంగాణ వద్దురా అన్న నినాదం కలకలమే రేపుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates