తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు.. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ తమ ఎన్నికల ప్రచారాలను నిలిపివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ప్రచారం ముగింపు రోజు.. ఎన్నికల సంఘం భారీ ప్రకటన చేసింది. 5 గంటలకే ప్రచారం ముగించాలని.. ఎక్కడైనా ఏ అభ్యర్థి అయినా.. 5 గంటల తర్వాత.. ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు అధికారుల దృష్టికి వస్తే.. అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు.. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా 5 గంటల తర్వాత.. ఎన్నికల ప్రచారం సాగితే..తమకు వీడియోలు పంపించాలని కోరింది.
దీంతో తమిళనాడు వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక, 234 అసెంబ్లీ స్థానాలకు గురువారం (ఏప్రిల్ 23) ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రజలకు డబ్బులు పంచకుండా.. ప్రలోభాలకు గురిచేయకుండా ఇప్పటికే తగిన భద్రత కల్పించినట్టు పేర్కొంది. ఇక, మంగళవారం, బుధవారం సహా గురువారం పోలింగ్ ప్రారంభమయ్యే సమయం వరకు కూడా ప్రతి 4 గంటలకు ఒకసారి.. విధులు మార్చుకునేలా అధికారులకు, పోలీసులకు వెసులు బాటు కల్పించింది. అంటే.. ప్రతి 4 గంటలకు ఒకసారి సిబ్బంది యాక్టివ్ అవుతారు.
రెండు కూటములు+ఒక సింగిల్ పార్టీ మధ్య..
ఈ ఎన్నికలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని డీఎంకే కూటమి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను భావిస్తోంది. దీనికితోడు సింగిల్ పార్టీగా బరిలో నిలిచిన విజయ్ నేతృత్వంలో వెట్రికళగం పార్టీ కూడా ఎన్నికలను కీలకంగా భావించింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కేంద్రం నుంచి పలువురు మంత్రులు తమిళనాడులోనే తిష్ఠ వేశారు. అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రచారం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. విజయ్ సైతం.. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. సమయాభావంతో నాలుగు జిల్లాలను వదిలేయాల్సి వచ్చింది.
ఏయే అంశాలు ప్రభావం..
ఈ ఎన్నికలపై పలు కీలక అంశాలు ప్రభావం చూపుతాయని పరిశీలకులు చెబుతున్నారు.
1) ఇటీవల పార్లమెంటులో వీగిపోయిన మహిళా బిల్లు(బీజేపీ ఇలానే ప్రచారం చేస్తోంది.)
2) తమిళవాద అస్తిత్వం.
3) క్రిస్టియన్ మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారన్న విజయ్ పార్టీ టీవీకే వాదన.
4) కేంద్రం చేపట్టిన అభివృద్ధి.
5) కాశీ-తమిళసంగం పేరుతో నిర్వహించిన కాశీయాత్ర.
6) వివిధ పార్టీల సంక్షేమ పథకాల వరాల వర్షం.
7) తమిళనాడుపై త్రిభాషా సూత్రాన్ని రుద్దుతున్నారన్న డీఎంకే వాదన.
8) అన్నాడీఎంకేలో చీలికలు.. ప్రత్యేక పార్టీలు.. పళని స్వామి ఈ దఫా ఒంటరి పోరు.
పారిన నోట్ల వరద..
ఇక, ఎన్నికల ప్రచారం ఎలా ఉన్నా.. ఎన్నికల సంఘం నిబంధనలను ముందుగానే పసిగట్టిన పలు పార్టీలు .. తమ తమ అభ్యర్థులకు స్వేచ్ఛ నిచ్చాయి. దీంతో ప్రచార పర్వం ప్రారంభం కాగానే.. ప్రజలను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు సైతం సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే దాదాపు 480 కోట్ల రూపాయలను ఎన్నికల సంఘం అధికారులు పట్టుకున్నారు. ఇంతకు రెండింతలు ప్రజల చేతుల్లోకి వెళ్లాయన్న వాదన కూడా ఉంది. అలానే.. బంగారం పంపిణీ.. వెండి వస్తువుల పంపిణీ కూడా జోరుగా సాగిందని స్థానిక మీడియా పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates