క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న ఆయ‌న కోరిక ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అయినా.. నెర‌వేరుతుందా? అంటే.. చెప్ప‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. అస‌లు ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంది? అంటే.. పెద‌వి విరుపులే క‌నిపిస్తున్నాయి. వైసీపీ-టీడీపీకి స‌మాన డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు.

ప్ర‌ధానంగా  రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు ఏదో ఒక‌వైపు స్టిక్ ఆన్ అయిపోవాలి. కానీ.. క‌ర‌ణం మాత్రం ఎవ‌రు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉంటున్నారు. ముఖ్యంగా సొంత నియోజ‌క‌వ‌ర్గం అద్దంకిలో త‌న ప్ర‌త్య‌ర్థులు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆయ‌నేమో వైసీపీ అని చెబుతున్నా.. ఆ పార్టీలోనూ యాక్టివ్‌గా లేర‌ని.. జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశారు. ఇటీవ‌ల జిల్లాల వారీగా ఎవ‌రెవ‌రు యాక్టివ్‌గా ఉన్నార‌న్న జాబితాను పార్టీ రెడీ చేసింది.

ఈ జాబితాలో క‌ర‌ణం ఫ్యామిలీ పేరు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పోనీ.. ఆయ‌న వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారా? అంటే.. అది కూడా క‌నిపించ‌లేదు. దీంతో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌ర‌ణం కుటుంబం అస‌లు పోటీలో ఉంటుందా? ఉండ‌దా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఇక‌, కూట‌మి పార్టీల‌వైపు అనుకూలంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా.. అది కూడా తేడా కొడుతోంది. మంత్రి గొట్టిపాటి ర‌వి యాక్టివ్‌గా ఉన్నంత వ‌ర‌కు.. క‌ర‌ణం రాజ‌కీయాలు టీడీపీలో పెద్ద‌గా ఉండ‌వ‌ని ఆయ‌న అనుచ‌రులే చెబుతున్నారు.

ఇలా రెండు ప‌క్క‌ల చెడిపోయిన కుటుంబంగా క‌ర‌ణం ఫ్యామిలీ గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి చీరాల‌లో 2019లో విజ‌యం ద‌క్కించుకున్నా.. ఆయ‌న ఎక్కువ కాలం టీడీపీలో లేరు. వైసీపీ పంచ‌న చేరిపోయారు. ఇది చంద్ర‌బాబు స‌హా.. మంత్రి నారా లోకేష్‌కు న‌చ్చ‌డం లేదు. ఎన్నో ఇబ్బందులు ప‌డిన వారు సైతం పార్టీలో ఉన్నార‌ని.. గెలిచిన క‌ర‌ణం మాత్రం పార్టీకి అన్యాయం చేశార‌న్న వాద‌న ఇప్ప‌టికీ వినిపిస్తోంది. ఫ‌లితంగా రెంటికీ చెడ్డ‌రేవ‌డి మాదిరిగా క‌ర‌ణం పాలిటిక్స్ మారాయ‌ని అంటున్నారు.