తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగిరీ ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ఈ నెలాఖరులోగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోతే… అజ్జూ భాయ్ మంత్రిగిరీ ఊడిపోయినట్టే.
ఎందుకంటే…ప్రస్తుతం ఏ చట్టసభలోనూ సభ్యుడిగా లేకుండానే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రి పదవి చేపట్టిన నేత ఆరు నెలల్లోగా అటు ఎమ్మెల్యేగానో, లేదంటే ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సి ఉంది. అలా కాని పక్షంలో ముఖ్యమంత్రి అయినా, మంత్రులు అయినా తమ పదవులను ఇట్టే కోల్పోతారు.
క్రికెటర్ గా తన కెరీర్ ను ముగించిన వెంటనే అజారుద్దీన్ పెద్దగా లేట్ చేయకుండానే రాజకీయాల్లోకి వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. మొరాదాబాద్ నుంచి ఓ దఫా ఎంపీగా ఎన్నికైన అజారుద్ధీన్… ఆ తర్వాత ఎన్నికల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినా విజయం దక్కలేదు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం దక్కింది. ఆ వెంటనే ఆయనను రేవంత్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. మైనార్టీ సంక్షేమంతో పాటుగా పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ను అజారుద్దీన్ కు అప్పగించారు. అయితే అజారుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరాంల ఎమ్మెల్సీ పదవులకు ఇప్పటిదాకా గవర్నర్ అనుమతే లభించలేదు.
డిసెంబర్ 31న అజారుద్దీన్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ లెక్కన ఈ నెలాఖరు నాటికి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. అలా కాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి నుంచి దిగిపోక తప్పదు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఆదివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన రేవంత్…గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. చాలా రోజులుగా రాజ్ భవన్ లో పెండింగ్ లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైల్ ను క్లియర్ చేయాలని ఈ సందర్భంగా ఆయన శుక్లాను కోరారు. సీఎం ప్రతిపాదనకు శుక్లా ఓకే అంటే సరేసరి. లేదంటే… ఈ నెలాఖరు తర్వాత మంత్రి పదవి నుంచి దిగిపోక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates