బిల్లు ఏదైనా సరే.. ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాజకీయ వర్గాలు విస్తుపోయే విధంగా బీజేపీ భజనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంలో జగన్‌కు సిగ్గుండాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఘాటుగానే వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుగా ఎన్డీఏ పక్షాన జగన్ నిలబడినందుకు ఆమె ఫైర్ అయ్యారు.
జగన్ వైఖరి ద్వారా బీజేపీతో ఉన్న “అక్రమ పొత్తు” బయటపడిందని షర్మిల విమర్శించారు. విపక్షం ముసుగులో ఉన్న వైసీపీ వాస్తవానికి ఆర్ఎస్సెస్ పక్షాన పనిచేస్తోందని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే జగన్‌కు ముఖ్యమైందా అని ప్రశ్నించారు.
అక్రమ డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, దీనిపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, “కేసుల నుంచి బయటపడటానికి బానిసలా వ్యవహరించాలా?” అని ప్రశ్నించారు. బీజేపీ బిల్లులకు గుడ్డిగా మద్దతు తెలపడం ప్రజాస్వామ్యానికి విఘాతం అని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడాన్ని కూడా షర్మిల తప్పుబట్టారు. మహిళల 33 శాతం రిజర్వేషన్లకు ఎవరికీ వ్యతిరేకత లేదని, కానీ దాన్ని ఇతర బిల్లులతో లింక్ చేయడం అన్యాయం అని పేర్కొన్నారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, దానిని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
డీలిమిటేషన్ ప్రక్రియలో ముందుగా 2026 జనాభా లెక్కలు, కుల గణన వివరాలు పరిగణనలోకి తీసుకోవాలని షర్మిల సూచించారు. ఎస్సీ, ఎస్టీ, ఒబీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, చిన్న రాష్ట్రాల ఆందోళనలను గౌరవించాలని అన్నారు.
అధికారిక గణాంకాలు లేకుండా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనను విమర్శిస్తూ, “ఇది దేశాన్ని మోసం చేసే ప్రయత్నం” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే బాబు–జగన్–పవన్ కలయికేనని వ్యాఖ్యానించారు. నిజమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates