ఎవ‌రీ తేజ‌స్వి..? ఎందుకింత రాజ‌కీయ మంట‌!

ప్ర‌స్తుతం తెలంగాణ స‌హా త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ఏకైక పేరు తేజ‌స్వి సూర్య‌. ఈయ‌న‌ను ఎంపీ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు గెంటాల‌ని.. ఈ రెండు రాష్ట్రాల్లోని అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ తేజ‌స్వికి వ్య‌తిరేకంగా ప్ర‌క‌ట‌న‌లే కాదు.. ఆయ‌న దిష్టి బొమ్మ ద‌హ‌నాలు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు ఎవరీ తేజస్వి? ఎందుకిలా రాజ‌కీయ మంటలు చెల‌రేగాయి? అనేది ఆస‌క్తిగా మారింది.

తేజ‌స్వి సూర్య‌. పూర్తి పేరు.. ల‌క్య సూర్య‌నారాయ‌ణ తేజ‌స్వి సూర్య‌. తెలుగు మూలాలు ఉన్న క‌న్న‌డిగుడు. క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు ద‌క్షిణ పార్ల‌మెంటు స్థానం నుంచి 2019, 2024లో బీజేపీ త‌ర‌ఫున ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. వ‌య‌సు 35 సంవ‌త్స‌రాలు. 25వ ఏట‌నే ఆయ‌న రాజ‌కీయాలు ప్రారంభించారు. బీజేపీ అన్నా.. హిందూత్వం అన్నా.. అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. కేంద్రంలో మంత్రిప‌ద‌విపై క‌న్నేశార‌నే టాక్ వినిపిస్తుంది. దీంతో త‌ర‌చుగా ప్ర‌ధాని మోడీని, కేంద్ర మంత్రి అమిత్‌షాను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు.

ఇప్పుడు ఏం చేశారు…

తాజాగా పార్ల‌మెంటులో మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, డీలిమిటేష‌న్ బిల్లులు వ‌చ్చిన‌ప్పుడు త‌న‌వంతుగా మైకు అందుకున్న తేజ‌స్వి.. దీనిలో డీలిమిటేష‌న్‌ను వ్య‌తిరేకిస్తున్న డీఎంకే(త‌మిళ‌నాడు అధికార పార్టీ) స‌హా కాంగ్రెస్ పార్టీల‌ను కార్న‌ర్ చేసుకుని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణ‌-ఏపీ విభ‌జ‌న‌ను పాకిస్థాన్‌-భార‌త్ విభ‌జ‌న‌తో పోల్చారు. నాడు గుడ్డిగా కాంగ్రెస్ చేసిన విభ‌జ‌న స‌రైందేనా? అని ప్ర‌శ్నించారు. ఇది తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీల‌కు మంట‌పుట్టించింది.

ఫ‌లితంగా హ‌రీష్‌రావు, క‌విత నుంచి కేటీఆర్ దాకా.. అటు అధికార ప‌క్షం కాంగ్రెస్‌లోని పొన్న ప్ర‌భాక‌ర్ నుంచి ప‌లువురు మంత్రుల వ‌ర‌కు తేజ‌స్విపై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేశారు. బీజేపీ సైతం ఆయ‌న స‌భ్య‌త్వాన్ని రద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఇక‌, త‌మిళ‌నాడు విష‌యానికి వ‌స్తే.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై డీఎంకే మొస‌లి క‌న్నీరు కారుస్తోందని.. మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ఆ పార్టీకి న‌చ్చ‌డం లేద‌ని తేజ‌స్వి విమ‌ర్శించారు. గ‌తంలో మ‌హిళా బిల్లును వ్య‌తిరేకించిన పార్టీల‌తో జ‌ట్టుక‌ట్టి.. ఉత్త‌రాది-ద‌క్షిణాది అంటూ.. విభ‌జ‌న రాజ‌కీయాల‌కు తెర‌దీసింద‌ని మండిప‌డ్డారు. ఈ వ్య‌వ‌హారం త‌మిళ‌నాడులో మంట‌లు రేగేలా చేసింది. ఫ‌లితంగా తేజ‌స్వికి వ్య‌తిరేకంగా డీఎంకే, కాంగ్రెస్‌లు నిర‌స‌న చేప‌ట్టాయి.