కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్రజలు మేకిన్ ఇండియా కావాలని కోరుకుంటే.. మోడీ మాత్రం లీకిన్ ఇండియాను ఇచ్చారని వ్యాఖ్యానించారు. గత 25 రోజులుగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థులకు తాము ఆది నుంచి అండగా ఉన్నామని.. కానీ, కొందరు ఈ విషయాన్ని గమనించలేక తమపై నిందలు వేస్తున్నారని.. పరోక్షంగా సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. తాము మొదటి నుంచి విద్యార్థులకు అనుకూలమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల పాత్ర ఎంత ఉందో ఇప్పుడున్న నాయకులకు ఏం(సీఎం) తెలుసునని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ సైతం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. కేంద్రంపై పోరాటంలో తమకు ఎవరూ సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 25 రోజులుగా విద్యార్థులు ఉద్యమిస్తే.. కాంగ్రెస్ పార్టీ తన స్వార్థరాజకీయాల కోసం.. ఇప్పుడు వేలు పెట్టిందన్న కేటీఆర్.. దీనిని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
ఇందిరాపార్క్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అటు కేంద్రం, ఇటు రాష్ట్ర సర్కారులపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ.. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకుందన్నారు. ప్రస్తుతం జనరేషన్.. మరణానికి సైతం తెగించే సత్తా ఉన్న జనరేషన్ అని తెలిపారు. యువత జవాబు దారీ తనం కోసం ఉద్యమిస్తోందన్నారు. కానీ, అదే యువతను చావగొట్టి.. వారిపై కేసులు పెట్టించారని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు జరిగే అన్యాయం ఇక్కడున్నబీజేపీ నాయకులకు కనిపించడం లేదని అన్నారు.
నిరూపించి ఉరేయండి!
పేపర్ లీకేజీకి.. తనకు సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్ ఖండించారు. అసలు పేపర్ లీకేజీకి.. తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఒక వేళ అదే నిజమైతే.. దానిని నిరూపించి..తనను ఇక్కడే(ఇందిరాపార్కు) ఉరేయాలని ఆయన సవాల్‌రువ్వారు. నోటికి వస్తే.. అది మాట్లాడడం ఎవరికీ మంచిది కాదన్న కేటీఆర్.. కేసీఆర్‌పై పదే పదే విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. సీఎంను నిద్రలో లేపి అడిగినా.. కేసీఆర్ కేసీఆర్ అని అంటున్నరంట. ఇంకేం చెప్తాం. కేసీఆర్ అంటే అంత భయం ఎందుకో!. అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో పోలీసులుచేసిన దారుణ ఘటనను బీఆర్ ఎస్ ఖండిస్తోందని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

