పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇటీవలి కాలంలో విమర్శల సుడిలో చిక్కుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న మల్లారెడ్డి త్వరలోనే పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారంపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే వస్తున్న మల్లారెడ్డి… తాజాగా శుక్రవారం కూడా అదే తరహా కౌంటర్ తో మీడియా ముందుకు వచ్చారు. ఎప్పటిమాదిరిగానే… ఈసారి కూడా తాను పార్టీ మారడం లేదంటూ ఆయన ఓ బ్లైండ్ స్టేట్ మెంట్ ఇచ్చేసి వెళ్లిపోయారు.
టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంవించిన మల్లారెడ్డి… తెలుగు నేల విభజన తర్వాత అనివార్య కారణాలతో బీఆర్ఎస్ లో చేరిపోయారు. టీడీపీలో ఉండగా ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి… బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి… తన శాఖకు సంబంధించిన వివరాల వెల్లడి సందర్భంగా తనదైన మార్కును సంపాదించుకున్నారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కారు కూలిపోగా… మల్లారెడ్డి మరోమారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మల్లారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని ఓ సారి వార్తలు వినిపిస్తే.. మల్లారెడ్డి తన కుటుంబంతో సహా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని మరోమారు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరహా వార్తలు వినిపించిన ప్రతి సారీ వాటికి వివరణలు ఇవ్వక తప్పడం లేదు మల్లారెడ్డికి. ఇప్పటికే పలు మార్లు ఈ వార్తలను నేరుగానే ఖండించిన మల్లారెడ్డి… తాజాగా శుక్రవారం కూడా అదే పని చేశారు. అంతేకాకుండా ప్రతిసారీ చెప్పినట్లుగానే ఆయన ఈసారి కూడా తాను పార్టీ మారడం లేదని, ఈ దిశగా వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవేనని కూడా ఆయన తేల్చేశారు.
ఇక శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం కదా. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూనే… కేటీఆర్ భవిష్యత్తుపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పిన మల్లారెడ్డి.. కేటీఆర్ 125 ఏళ్ల పాటు జీవించాలని ఆకాంక్షించారు. అంతటితో ఆగని మల్లారెడ్డి… కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కూడా తాను కోరుకుంటున్నానని కూడా అన్నారు. మొత్తంగా పార్టీ మారతానంటూ తనపై వస్తున్న వార్తలను ఖండించిన మల్లారెడ్డి… కేటీఆర్ కు అదిరేటి రీతిలో బర్త్ డే విషెస్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

